దూసుకుపోతున్న ఐసీఐసీఐ
ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. గతేడాది(2016-17) క్యూ4లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించిన ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ లాభాల దుమ్మురేపుతోంది. నిన్న మార్కెట్ ముగిసిన తరువాత ఫలితలను ప్రకటించిన బ్యాంక్ షేరు ఆరంభంలోనే అదరగొట్టింది. ఒక దశలో 9శాతం ఎగిసి స్టార్ ఆఫ్ ద డేగా నిలిచింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా జంప్‌చేసి రూ. 291 వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత‍్వం బ్యాంకుల మొండి బకాయిల(ఎన్‌పిఎ) సమస్య పరిష్కారం కోసం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం బ్యాంకింగ్ సెక్టార్లో జోష్ పెంచింది. దాదాపు అన్ని బ్యాంక్ పేర్లు లాభాల్లో ట్రేడ్‌అవుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు (188 శాతం) పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది. దీంతోపాటు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.
ప్రభుత్వ రంగ బ్యాంకు(పిఎస్బి)లకు గుది బండగా మారిన ఎన్‌పీఏ ల పరిష్కారంతో పాటు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక విషయాల కేంద్ర కేబినెట్ కమిటీ (సిసిఈ) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.