భారీ నిరాశలో ఐసీఐసీఐ
న్యూఢిల్లీ : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ భారీ నిరాశను మూగట్టుకుంది. నాలుగో త్రైమాసికం ఫలితాల్లో ఈ దిగ్గజం చతికిలపడింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేక, నికర లాభాలు 76శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో నికర లాభాలు రూ.702 కోట్లను మాత్రమే కంపెనీ చూపించింది. అయితే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన రూ.3,120 కోట్ల కంటే ఈ లాభాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఐసీఐసీఐ నికర లాభాలు రూ.2,922 కోట్లగా ఉన్నాయి.
బ్యాంకుకు మొండి బకాయిలు పెరగడంతోనే నికర లాభాలు పడిపోయాయని ఐసీఐసీఐ వెల్లడించింది. బ్యాంకుకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏ)లు 110 బేసిస్ పాయింట్లు పెరిగి, 5.82శాతంగా ఉన్నాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎన్ పీఏలు 4.72శాతంగానే ఉన్నాయి. నికర ఎన్ పీలు కూడా గతేడాది కంటే పెరిగి 2.98 శాతంగా నమోదయ్యాయి. బ్యాంకు నికర లాభాలు పడిపోయినప్పటికీ రుణదాతలు 46 శాతంకు పెరిగి, రూ.5,110 కోట్లగా నమోదయ్యాయి.
పన్ను చెల్లింపుల కంటే పన్ను లాభాలే ఎక్కువగా ఉన్నాయని, గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,200 కోట్లగా పన్ను చెల్లింపులుంటే, ఈ ఏడాది పన్ను లాభాలు రూ.521 కోట్లగా ఉన్నాయని ఐసీఐసీఐ తన త్రైమాసిక ఫలితాల్లో చూపించింది. నిరాశజనకమైన ఫలితాలతో ఐసీఐసీఐ బ్యాంకు బీఎస్ ఈ సెన్సెక్స్ లో స్వల్పంగా నష్టపోయింది.