న్యూఢిల్లీ: భారత్‌లో స్పోర్ట్స్ కవరేజ్ విస్తరణ కోసం రూ.20,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని మీడియా మొగల్ రూపర్డ్ మర్దోక్‌కు చెందిన స్టార్ నెట్‌వర్క్ బుధవారం తెలిపింది. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లకు కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్(ఈఎస్‌ఎస్)జాయింట్ వెంచర్‌లో ఈఎస్‌పీఎన్ వాటాను స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేయడంతో అన్ని ఈఎస్‌పీఎన్ చానెళ్ల పేర్లను కూడా మార్చింది. ఈఎస్‌పీఎన్ చానెల్‌ను స్టార్ స్పోర్ట్స్ 4గా, ఈఎస్‌పీఎన్ హెచ్‌డీని స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ2గాను, స్టార్ క్రికెట్‌ను స్టార్ స్పోర్ట్స్ 3గాను రీ బ్రాండ్ చేశారు. రూపర్డ్ మర్దోక్‌కు చెందిన న్యూస్ కార్పొరేషన్, వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ఈఎస్‌పీఎన్‌లు 16 ఏళ్ల క్రితం 50:50 జాయింట్ వెంచర్‌గా ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్(ఈఎస్‌ఎస్)ను ఏర్పాటు చేశాయి. ఇక స్టార్ స్పోర్ట్స్ చానెళ్లకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నామని కంపెనీ పేర్కొంది. క్రికెట్‌కు ఒక్క చానెలే సరిపోదని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ చెప్పారు.