PC: BCCI
దక్షిణాఫ్రికా గడ్డపై ఎనిమిదిసార్లు పర్యటన... 23 టెస్టుల్లో బరిలోకి...4 టెస్టుల్లో విజయాలు ... 12 పరాజయాలు... సమంగా ముగిసిన మరో 7 మ్యాచ్‌లు... అయితే 31 ఏళ్లలో ఒక్క సిరీస్ కూడా భారత్ సొంతం కాలేదు... గతంలో ఎన్నడూ గెలవని ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వేదికలపై కూడా ఈ మూడు దశాబ్దాల వ్యవధిలో తొలిసారి సిరీస్ విజయాలు సాధించి టీమిండియా లెక్క సరి చేసింది... కానీ ఇప్పటికి కొరకరాని కొయ్యలా మిగిలింది సఫారీ టూర్ మాత్రమే... ఇక్కడ మాత్రం మనకు ఇప్పటి వరకు సిరీస్ దక్కలేదు. ఈ రికార్డును చెరిపేసేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా మరోసారి దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో సత్తా చాటి భారత్ ఈసారి ఆ లోటును తీరుస్తుందా లేక స్వదేశంలో బలమైన సఫారీ సేన తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరం.
సెంచూరియన్: టి20, వన్డేల తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య నేటినుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొంత విరామం తర్వాత రెండు టీమ్‌లూ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టు ఆఖరిసారిగా గత జూలైలో వెస్టిండీస్ గడ్డపై సిరీస్ ఆడగా... దక్షిణాఫ్రికా స్వదేశంలో చివరిసారిగా గత మార్చిలో విండీస్‌తోనే తలపడింది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్‌ల నుంచి కూడా టి20, వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది.
ప్రసిధ్ కృష్ణకు అవకాశం...
పుష్కర కాలం... భారత టెస్టు క్రికెట్ గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న పుజారా, రహానే ఇద్దరూ తుది జట్టులో లేకుండా జట్టు విదేశీ గడ్డపై టెస్టు ఆడి 12 ఏళ్లు అయింది! 2012 జనవరిలో అడిలైడ్‌లో ఆసీస్‌తో మ్యాచ్ తర్వాత వీరిద్దరూ లేకుండా విదేశాల్లో టెస్టు ఆడని భారత జట్టు ఇప్పుడు కొత్తగా సిద్ధమైంది. వరల్డ్ కప్ ఫామ్‌ను బట్టి చూస్తే కెపె్టన్ రోహిత్, కోహ్లిల బ్యాటింగ్ భారత్‌కు కీలకం కానుంది. రాహుల్‌కు రెండు సిరీస్‌ల అనుభవం ఉండగా, గిల్ తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నాడు.
వీరితో పోలిస్తే శ్రేయస్, యశస్వి ఇంకా కొత్త ఆటగాళ్ల కిందే లెక్క. ఈ స్థితిలో రోహిత్, కోహ్లిల ప్రదర్శనపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కఠినమైన ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని భారత టాప్–6 ఎన్ని పరుగులు సాధిస్తుందనేది చూడాలి. ఆల్‌రౌండర్‌గా జడేజా రాణించాల్సి ఉంది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే అశ్విన్‌కంటే శార్దుల్‌కే చాన్స్ దక్కవచ్చు. బుమ్రా, సిరాజ్ ప్రధానంగా పేస్ బౌలింగ్ భారం మోస్తారు. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన షమీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. అతని స్థానంలో మూడో పేసర్‌గా ప్రసిధ్, ముకేశ్‌లకు ఒకరికి చాన్స్ ఉంటుంది.
పేస్ పదును...
టి20, వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చూస్తే ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్లు రబడ, ఎన్‌గిడి సమరోత్సాహంతో ఉన్నారు. వీరికి తోడుగా కొత్త స్టార్ కొయెట్జీ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డపై ఈ త్రయం బౌలింగ్ భారత్‌కు పరీక్ష పెట్టవచ్చు. భిన్నమైన శైలి గల జాన్సెన్ కూడా జత కలిస్తే జట్టు బౌలింగ్ మరింత పదునెక్కుతుంది. కెరీర్‌కు ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తున్న సీనియర్ ఎల్గర్‌తో పాటు మార్క్‌రమ్, బవుమా బ్యాటింగ్‌లో కీలకం. కొత్త ఆటగాళ్లు జోర్జి, బెడింగామ్ కూడా ప్రభావం చూపగలరు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెపె్టన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, శ్రేయస్, జడేజా, శార్దుల్, బుమ్రా, ప్రసిధ్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), ఎల్గర్, మార్క్‌రమ్, జోర్జి, బెడింగామ్, వెరీన్, జాన్సెన్, మహరాజ్, కొయెట్జీ, రబడ, ఎన్‌గిడి.
పిచ్, వాతావరణం
పేస్‌కు బాగా అనుకూలమైన పిచ్. తొలి రెండు రోజులు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా 28 టెస్టు మ్యాచ్‌లలో 22 గెలిచి, 3 మాత్రమే ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment