సెంచూరియన్: పేసర్ మొహమ్మద్ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్ వైఫల్యంతో సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తెంబా బవుమా (52; 10 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
బుమ్రా, శార్దుల్ చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 272/3తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (260 బంతుల్లో 123; 17 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్‌గిడి (6/71) భారత్‌ను దెబ్బ తీశాడు. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ (4) వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రాహుల్ (5), శార్దుల్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
(చదవండి: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు)
69 బంతుల్లో 7 వికెట్లు...
ఒకరోజు విరామం తర్వాత అనుకూల వాతావరణంలో ఆట మొదలు కాగా... భారత బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ చేరారు. తొలి రోజు జోరును కొనసాగించలేక టీమిండియా 55 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో రాహుల్, రహానే (48; 9 ఫోర్లు) వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. పంత్ (8), అశ్విన్ (4), శార్దుల్ (4) విఫలం కావడంతో భారత్ ఆశించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. 2018 సిరీస్ తరహాలో సెంచూరియన్‌లోనే ఎన్‌గిడి భారత్‌పై మళ్లీ ఆరు వికెట్లతో చెలరేగటం విశేషం.
షమీ జోరు...
భారత్ పేసర్ల ముందు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తేలిపోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఎల్గర్ (1)ను అవుట్ చేసిన బుమ్రా... ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే పీటర్సన్ (15)ను బౌల్డ్ చేసిన షమీ, కొద్ది సేపటికే మార్క్‌రమ్ (13)ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే డసెన్ (3)ను వెనక్కి పంపి సిరాజ్ కూడా వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ దశలో స్కోరు 32/4 వద్ద నిలవగా... బవుమా, డి కాక్ (34; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ప్రతిఘటించారు.
సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే రాహుల్ క్యాచ్ వదిలేయడం డి కాక్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ చక్కటి బంతితో డి కాక్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం శార్దుల్ ఓవర్లో బవుమా కొట్టిన మూడు ఫోర్లతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ను తప్పించుకుంది. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే బవుమా అవుట్ కాగా, చివర్లో రబడ (25) కొంత పోరాడగలిగాడు. షమీ తన కెరీర్‌లో ఆరో సారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు.
(చదవండి: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన)
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) డికాక్ (బి) రబడ 123; మయాంక్ (ఎల్బీ) (బి) ఎన్‌గిడి 60; పుజారా (సి) పీటర్సన్ (బి) ఎన్‌గిడి 0; కోహ్లి (సి) ముల్డర్ (బి) ఎన్‌గిడి 35; రహానే (సి) డికాక్ (బి) ఎన్‌గిడి 48; పంత్ (సి) డసెన్ (బి) ఎన్‌గిడి 8; అశ్విన్ (సి) మహరాజ్ (బి) రబడ 4; శార్దుల్ (సి) డికాక్ (బి) రబడ 4; షమీ (సి) డికాక్ (బి) ఎన్‌గిడి 8; బుమ్రా (సి) ముల్డర్ (బి) జాన్సెన్ 14; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (105.3 ఓవర్లలో ఆలౌట్) 327.
వికెట్ల పతనం: 1–117, 2–117, 3–199, 4–278, 5–291, 6–296, 7–296, 8–304, 9–308, 10–327.
బౌలింగ్: రబడ 26–5–72–3, ఎన్‌గిడి 24–5–71–6, మార్కో జాన్సెన్ 18.3–4–69–1, ముల్డర్ 19–4–49–0, మహరాజ్ 18–2–58–0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 1; మార్క్‌రమ్ (బి) షమీ 13; కీగన్ పీటర్సన్ (బి) షమీ 15; డసెన్ (సి) రహానే (బి) సిరాజ్ 3; బవుమా (సి) పంత్ (బి) షమీ 52; డికాక్ (బి) శార్దుల్ 34; ముల్డర్ (సి) పంత్ (బి) షమీ 12; జాన్సెన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 19; రబడ (సి) పంత్ (బి) షమీ 25; కేశవ్ మహరాజ్ (సి) అజింక్య రహానే (బి) బుమ్రా 12, ఎన్‌గిడి (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (62.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–2, 2–25, 3–30, 4–32, 5–104, 6–133, 7–144, 8–181, 9–193, 10–197.
బౌలింగ్: బుమ్రా 7.2–2–16–2, సిరాజ్ 15.1–3–45–1, షమీ 16–5–44–5, శార్దుల్ 11–1–51–2, అశ్విన్ 13–2–37–0.
Comments
Please login to add a commentAdd a comment