సాక్షి, హైదరాబాద్: చేసిన తప్పులు దిద్దుకోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వానికి పని సరిపోతోంది. రెవెన్యూ శాఖకు చెందిన భూముల్లో మైనింగ్ కార్యకలాపాలకు నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీల) జారీకి విధివిధానాల అమల్లో ప్రభుత్వం చేస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనం. రెవెన్యూ భూముల్లో ఖనిజాన్వేషణ (పీఎల్), మైనింగ్ లీజులు (ఎంఎల్), క్వారీ లీజులు (క్యూఎల్)ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను పరిశీలించి నిబంధనల ప్రకారం తహసీల్దారు ఎన్‌వోసీ జారీ చేయాల్సి ఉంటుంది.
తహసీల్దారు స్వయంగా ఆ భూమిని పరిశీలించి ఎన్‌వోసీ ఇవ్వవచ్చా... లేదా? అనే అంశంపై కలెక్టరుకు, భూగర్భ గనుల శాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు 1998లోనే ప్రభుత్వం జీవో 181ని జారీ చేసింది. ఎన్‌వోసీల జారీలో తహసీల్దార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల తప్పులు జరుగుతున్నందున వీటి జారీ అధికారాన్ని రద్దు చేయాలని గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం నిర్ణయించింది. అయిదారు నెలలు ఎన్‌వోసీల జారీ ప్రక్రియ ఆగిపోయిన తర్వాత ఎంతో కసరత్తు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ కలెక్టరు నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీకి ఎన్‌వోసీల జారీ అధికారాన్ని అప్పగిస్తూ ఈ ఏడాది జనవరి 2న ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్లు పని ఒత్తిడిలో ఉండటంవల్ల ఈ స్క్రీనింగ్ కమిటీల గురించి పట్టించుకోవడంలేదు. దీంతో పీఎల్, ఎంఎల్ తదితరాల కోసం దరఖాస్తు చేసిన వారికి నెలలు గడిచినా ఎన్‌వోసీలు రావడంలేదు. కలెక్టరు నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటై పది నెలలు దాటినా రంగారెడ్డి జిల్లాలో పట్టుమని పది ఎన్‌వోసీలు కూడా జారీ కాలేదు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి.
అందువల్ల ఎన్‌వోసీల జారీ అధికారాన్ని పరిమిత విస్తీర్ణానికి సంబంధించి మళ్లీ తహసీల్దార్లకే ఇవ్వాలని భూగర్భ గనుల శాఖ తాజాగా రెవెన్యూ శాఖకు ప్రతిపాదన పంపింది. ‘‘అంటే ఇంచుమించుగా మళ్లీ జీవోను అమలు చేయడమే. అప్పట్లో కలెక్టర్లు పని ఒత్తిడిలో ఉంటారనే విషయాన్ని కమిటీ గుర్తించకుండా స్క్రీనింగ్ కమిటీకి కలెక్టరు నేతృత్వం వహించాలని జీవో జారీ చేయడంవల్లే సమస్య ఏర్పడింది. దీనివల్ల మళ్లీ ఎన్‌వోసీల జారీకి సంబంధించి పాత విధానాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయక తప్పేలా లేదు. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇసుక విధానం కూడా అదే విధంగా తయారైంది. దీనిని కూడా సవరించక తప్పేలా లేదు’’ అని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
స్క్రీనింగ్ కమిటీకి మంగళం!
Published Sun, Dec 1 2013 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement