Revenue branch
-
ముప్పై సెంట్లు మింగేద్దామనే..
పాలకొండ: ఈ స్థలం మాది అంటూ రెవెన్యూ శాఖ అక్కడ బోర్డు పాతింది. కానీ చాలా ఈజీగా ఆక్రమణదారులు ఆ బోర్డును పీకిపారేశారు. ఈ జాగా ప్రభుత్వానిది అంటూ సాక్షాత్తు ఆర్డీఓనే సరిహద్దులు చూసి మరీ చెప్పారు. కానీ అక్రమార్కులకు ఈ మాటలు పట్టలేదు. ఏ సరిహద్దులు పరిశీలించారో అదే చోట చక్కగా కంచె వేసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పల్లెత్తి మాట్లాడడం లేదు. పాలకొండలో జరుగుతున్న ఈ ఆక్రమణ సీను అధికార పార్టీ నాయకుల దురాగతాన్ని, అధికారుల నిస్సత్తువను తేటతెల్లం చేస్తోంది. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకొని సర్వే నం బర్20/1, 20/2లో సుమారు ముప్పై సెంట్ల స్థలం ఉంది. దీని విలువ రూ.రెండు కోట్లు దాటే ఉంటుంది. ఈ స్థలాన్ని కాజేసేందుకు కొంత కాలం కిందట కొందరు పెద్దలు ప్రయత్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చాలా కష్టపడ్డారు. అయితే అప్పట్లో అధికారులు అడ్డుకోవడంతో వారి పప్పులు ఉడకలేదు. కానీ ఇప్పు డు మళ్లీ అదే సీను రిపీటవుతోంది. కానీ రెవె న్యూ అధికారులు ఈ విషయం పైకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఈ స్థలాన్ని ఓ వ్యక్తికి అప్పగించి నజ రానా పొందేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సహకారం అందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల చర్యలు కూడా వీరికి బలం చేకూర్చేలా ఉన్నాయి. గతంలో స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి ఇప్పుడు దాని చుట్టూ దర్జాగా కంచె వేసుకున్నాడు. అందులో రెవెన్యూ వారు ఇదివరకు ఏర్పాటు చేసిన బోర్డులను కూడా తీసివేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ఒక సారి రెవెన్యూ స్వాధీనం చేసుకున్న స్థలం తిరిగి ఆక్రమణ దారులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు మౌనం గా ఉంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆక్రమణదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేందుకు మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రెవెన్యూ రికార్డుల్లో రహదారి పోరంబోకుగా ఉన్న ఈ స్థలానికి ఎలాం టి పట్టాలు ఇచ్చేందుకు అనుమతి లేదని అధికారులే చెబుతుండడం విశేషం. తక్షణ చర్యలు తీసుకుంటాం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో కంచె వేయటంపై ఆర్డీవో రెడ్డి గున్నయ్య వద్ద ’సాక్షి’ ప్రస్తావిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనే ఆక్రమణ దారులపై కేసు నమోదు చేయాలని తెలి పామని, స్థలంలో బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం కంచెను తొలగించేందుకు తహశీల్దార్‌కు ఆ దేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాజే సేందుకు ప్రయత్నించిన వారి పైన, వారికి సహకరించిన వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కొత్తగా ఏడు జిల్లాలే!
* ప్రతిపాదనలివ్వాలంటూ రెవెన్యూ శాఖకు సీఎంవో ఆదేశం * తొలుత మంచిర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు * అనంతరం కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, జగిత్యాలపై దృష్టి * ఏడు జిల్లాలు కూడా ఇప్పుడప్పుడే అసాధ్యమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనూ ఎలాంటి వివాదాలకు తావులేని వాటిని ముందుగా చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను సీఎం కార్యాలయం ఆదేశించింది కూడా. అయితే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు మొత్తం 24 జిల్లాలు కాకుండా.. ఒక్కో లోక్‌సభ స్థానం పరిధికి ఒక జిల్లా చొప్పున తెలంగాణలో 17 జిల్లాలు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దశలవారీగా జిల్లాల ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత పెద్దగా వివాదాలకు అవకాశం లేని మంచి ర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలను ఏర్పా టు చేసి.. అనంతరం కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, జగిత్యాల జిల్లాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంలో ప్రాంతాల వారీగా పలు వివాదాలు, కొత్త డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వానికి అంతర్గత రాజకీయ చిక్కులను తెచ్చిపెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో దశలవారీగా, పరిస్థితులను బట్టి జిల్లాలను విభజించడం వల్ల స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆర్థికభారం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు. తొలుత ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏడు జిల్లాల విషయంలోనూ.. పలు వివాదాల కారణంగా అవి ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మేనిఫెస్టోలో 24 జిల్లాలు... పరిపాలనా వికేంద్రీకరణ, జిల్లా కేంద్రాలను మెట్రో నగరాల స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో... తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉండగా... ఒక్కో జిల్లాను ఐదు నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తామని, ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో మాత్రం నాలుగు నియోజకవర్గాలు ఉంటాయని పేర్కొంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు పలు కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడున్న 119 నియోజకవర్గాలు వచ్చే ఐదేళ్లలో 153కు పెరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త చిక్కులు వచ్చే అవకాశముంది. దీంతోపాటు పలు స్థానిక సమస్యలూ తలెత్తుతాయి. ఒక్కో లోక్‌సభ స్థానానికి ఒక జిల్లా? జిల్లాల విభజన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే... ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తే చాలని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు. తొలుత వివాదాలు లేనివే! తొలుత వివాదాలు లేని జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. వీటిపైనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలపై రెవెన్యూఅధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
7,173 పోస్టుల భర్తీ
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 7,173 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ బుధవారం జీవో జారీ చేశారు. ఈ పోస్టులన్నింటినీ ఆయా శాఖలు ఎంపిక కమిటీ, రాత పరీక్షల ద్వారా డెరైక్ట్ రిక్రూట్ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రిజర్వేషన్లతోపాటు రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ విధానాన్ని పాటించాలని కూడా పేర్కొన్నారు. జోనల్, జిల్లాలవారీగా పోస్టుల వివరాలతో భర్తీకోసం వెంటనే ఆయా శాఖలు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులు 4,305, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు 1,657, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం విభాగాల్లో 658 పోస్టులు భర్తీ చేయనున్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 44 అసిస్టెంట్ ప్రొఫెసర్, 36 అసోసియేట్ ప్రొఫెసర్, 30 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో 46 స్టాఫ్ నర్స్ పోస్టులు, 28 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 30 ఎఫ్ఎన్ఓ, ఎన్ఓ పోస్టులు, 23 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. -
స్క్రీనింగ్ కమిటీకి మంగళం!
సాక్షి, హైదరాబాద్: చేసిన తప్పులు దిద్దుకోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వానికి పని సరిపోతోంది. రెవెన్యూ శాఖకు చెందిన భూముల్లో మైనింగ్ కార్యకలాపాలకు నిరభ్యంతర పత్రాల (ఎన్వోసీల) జారీకి విధివిధానాల అమల్లో ప్రభుత్వం చేస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనం. రెవెన్యూ భూముల్లో ఖనిజాన్వేషణ (పీఎల్), మైనింగ్ లీజులు (ఎంఎల్), క్వారీ లీజులు (క్యూఎల్)ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను పరిశీలించి నిబంధనల ప్రకారం తహసీల్దారు ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. తహసీల్దారు స్వయంగా ఆ భూమిని పరిశీలించి ఎన్వోసీ ఇవ్వవచ్చా... లేదా? అనే అంశంపై కలెక్టరుకు, భూగర్భ గనుల శాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు 1998లోనే ప్రభుత్వం జీవో 181ని జారీ చేసింది. ఎన్వోసీల జారీలో తహసీల్దార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల తప్పులు జరుగుతున్నందున వీటి జారీ అధికారాన్ని రద్దు చేయాలని గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం నిర్ణయించింది. అయిదారు నెలలు ఎన్వోసీల జారీ ప్రక్రియ ఆగిపోయిన తర్వాత ఎంతో కసరత్తు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ కలెక్టరు నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీకి ఎన్వోసీల జారీ అధికారాన్ని అప్పగిస్తూ ఈ ఏడాది జనవరి 2న ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్లు పని ఒత్తిడిలో ఉండటంవల్ల ఈ స్క్రీనింగ్ కమిటీల గురించి పట్టించుకోవడంలేదు. దీంతో పీఎల్, ఎంఎల్ తదితరాల కోసం దరఖాస్తు చేసిన వారికి నెలలు గడిచినా ఎన్వోసీలు రావడంలేదు. కలెక్టరు నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటై పది నెలలు దాటినా రంగారెడ్డి జిల్లాలో పట్టుమని పది ఎన్వోసీలు కూడా జారీ కాలేదు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. అందువల్ల ఎన్వోసీల జారీ అధికారాన్ని పరిమిత విస్తీర్ణానికి సంబంధించి మళ్లీ తహసీల్దార్లకే ఇవ్వాలని భూగర్భ గనుల శాఖ తాజాగా రెవెన్యూ శాఖకు ప్రతిపాదన పంపింది. ‘‘అంటే ఇంచుమించుగా మళ్లీ జీవోను అమలు చేయడమే. అప్పట్లో కలెక్టర్లు పని ఒత్తిడిలో ఉంటారనే విషయాన్ని కమిటీ గుర్తించకుండా స్క్రీనింగ్ కమిటీకి కలెక్టరు నేతృత్వం వహించాలని జీవో జారీ చేయడంవల్లే సమస్య ఏర్పడింది. దీనివల్ల మళ్లీ ఎన్వోసీల జారీకి సంబంధించి పాత విధానాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయక తప్పేలా లేదు. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇసుక విధానం కూడా అదే విధంగా తయారైంది. దీనిని కూడా సవరించక తప్పేలా లేదు’’ అని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.