భారత్-పాక్ కంచె వద్ద భీకర సన్నివేశం
శ్రీనగర్: శత్రువును వేడుకునే సందర్భం యుద్ధంలోనే ఎదురవుతుందనుకుంటే ఇండియా-పాకిస్థాన్‌లు ఇప్పటికే యుద్ధం చేస్తున్నట్లు లెక్క. నియంత్రణరేఖ(ఎల్‌వోసీ)ని ఆనుకుని ఉన్న నూర్‌కోటే గ్రామంలో కనిపించిన ఈ భీకర సన్నివేశం కశ్మీరీలు ఎంతటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలియజేసేలా ఉంది.
గడిచిన కొద్ది నెలలుగా సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్ రేంజర్లు విచ్చలవిడి కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం నాడు పాక్ జరిపిన కాల్పుల్లో నూర్‌కోటేకు చెందిన తన్వీర్ అనే16 ఏళ్ల బాలుడు చనిపోయాడు. పూంచ్ జిల్లా హవేలీ తాలూకాలో ఉన్న నూర్‌కోటే గ్రామంలో.. సరిగ్గా కంచె వెంబడే ఆ బాలుడి కుటుంబానికి చెందిన పొలం ఉంది. చనిపోయిన అతణ్ని పొలంలోనే సమాధి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. శుక్రవారం జనాజా ప్రార్థన ముగిసిన తర్వాత శవయాత్ర బయలుదేరింది.. అంతలోనే పాక్‌వైపు నుంచి మళ్లీ కాల్పుల మోత!
అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితిలో.. మత పెద్దలు మసీదులోని మైక్ నుంచి బిగ్గరగా అరిచారు.. 'మీరు మా వాణ్ని కాల్చిచంపారు. అతని అంత్యక్రియలు నిర్వహించాలి. కాల్పులు ఆపండి..' అని! మతపెద్దల ప్రకటనతో కొద్ది సేపటికి అటువైపు నుంచి తూటాల వర్షం ఆగింది. వెంటనే అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు విషాద హృదయాలతో వెనుతిరిగారు. సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్ మీర్ మీడియాకు చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్‌ప్యాడ్లపై (సెప్టెంబర్ చివరల్లో) భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత దాయాది దేశం దాదాపు 300 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ కాల్పుల్లో ఇప్పటివరకు 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది భద్రతా సిబ్బందే కావడం గమనార్హం. ఆదివారం ఉదయం కూడా పూంఛ్ సెక్టార్‌పైకి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు.