పాకిస్థాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక!
కశ్మీర్‌లోని పరిస్థితులపై ‘బ్లాక్ డే’ పాటించిన పాకిస్థాన్ మీద భారత్ తీవ్రంగా మండిపడింది. భారత గడ్డపై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, మద్దతు తెలుపడం మానుకోవాలని, భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని గట్టిగా పేర్కొంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘బ్లాక్ డే’ పాటించడాన్ని ఖండించింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారు పాకిస్థాన్‌లో యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. లష్కరే తోయిబా స్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బుధవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీ నిర్వహించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్ బుర్హన్ వనీ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో తలెత్తిన హింసాత్మక ఆందోళనల్లో 44 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై పాక్ ప్రధాని షరీఫ్ కేబినెట్ బ్లాక్ డే నిర్వహించడం, జిహాదీ నాయకులైన సయీద్ లాంటివారు పాక్ అంతటా ఆందోళనలు నిర్వహించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మన దేశంలో ఉగ్రవాదాన్ని, హింసను రెచ్చగొట్టడం, మద్దతు తెలుపడం పాక్ మానుకోవాలని మేం మరోసారి స్పష్టంచేస్తున్నాం. అదేవిధంగా మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేయవద్దని చెప్తున్నాం’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.