షరీఫ్ కల నెరవేరదు: సుష్మ
కశ్మీర్ భారత అంతర్భాగమే
న్యూఢిల్లీ: ఏదో ఒకరోజు కశ్మీర్.. పాకిస్తాన్‌లో భాగం అవుతుందన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. షరీఫ్ కల ఎప్పటికీ తీరదని తేల్చిచెప్పారు. పాక్ ప్రధాని పగటి కలలు కనటం మానుకోవాలన్నారు. విదేశాంగ సహాయ మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్‌లతో కలసి సుష్మ ఈ ప్రకటన చేశారు. ‘ఈ ప్రమాదకర ఆలోచన కారణంగానే.. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమే. ఈ భూతల స్వర్గాన్ని ఉగ్రవాదుల అడ్డాగా మీరు మార్చలేరు’ అని సుష్మ అన్నా రు. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌పై పాక్ ప్రచారాన్ని ఖండించారు. క్రూరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని.. స్థానిక ప్రజాప్రతినిధులను, భద్రతా బలగాలను చంపిన వ్యక్తిని వీరుడిగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. కశ్మీర్‌కు ఉగ్రవాదులను, ఆయుధాలను పాకిస్తాన్ సరఫరా చేస్తోందని.. ఇక్కడి ప్రజల గురించి ఎప్పుడూ మంచిగా ఆలోచించలేదని విమర్శించారు. డబ్బు, ఉగ్రవాదం, వివాదాస్పద ప్రకటనలతో కశ్మీర్‌లో చిచ్చుపెడుతున్నారన్నారు.
రాజ్యాంగ పరిధిలో డిమాండ్లు: రాం మాధవ్
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని.. దీనిపై చర్చే అవసరం లేదని బీజేపీ నేత రాం మాధవ్ శనివారం పుణేలో అన్నారు. కశ్మీరీల డిమాండ్లు రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నారు.
కిడ్నాపైన భారత మహిళను రక్షించాం
కాబూల్‌లో అపహరణకు గురైన భారత మహిళ జుడిత్ డిసౌజాను రక్షించామని సుష్మ తెలిపారు. అగా ఖాన్ ఫౌండేషన్‌లో టెక్నికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న జుడిత్‌ను ఆమె ఆఫీస్ వద్ద ఉగ్రవాదులు గత నెల 9న కిడ్నాప్ చేశారు. విడుదలకు సహకరించిన అఫ్గాన్ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జుడిత్ శనివారం అఫ్గాన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.