ఆపరేషన్ గంభీర్ | Image for the news result Sushma Swaraj To Address UNGA, Strong Response Against Pakistan Expected | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ గంభీర్

Published Mon, Sep 26 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

ఆపరేషన్ గంభీర్

ఆపరేషన్ గంభీర్

సుష్మా స్వరాజ్ న్యూయార్క్ చేరుకున్నారు. ఇవాళ ఐక్యరాజ్యసమితిలో ఆమె స్పీచ్ ఉంది. పాక్ వైఖరిపై ఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంత నిక్కచ్చిగా మాట్లాడబోతున్నారో... యు.ఎన్.లో మొన్నటి యువ మహిళా దౌత్యాధికారి ఈనమ్ గంభీర్ ప్రసంగంతోనే స్పష్టమైపోయింది. ఈనమ్ ఇచ్చిన పంచ్‌లకు పాక్ కంగుతింది! కశ్మీర్‌పై పాకిస్తాన్ దుష్ర్పచారానికి దీటుగా ఈనమ్ ఆల్రెడీ మొన్న ఇచ్చిన, నేడు సుష్మ ఇవ్వబోతున్న ‘రిబటల్స్’ (ఖండన వాదాలు)... భారతదేశపు సరికొత్త రక్షణ దళంగా ‘మహిళాశక్తి’ అవతరించ బోతోందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి.  
 
ప్రసంగం 20 నిమిషాలు
కశ్మీర్‌లో ఉద్రిక్తతలు భారత్ కారణంగానే పెరిగాయి. కశ్మీర్ యువత ఉద్యమ నేత బుర్హాన్‌ను భారత భద్రతా దళాలు చంపేయడంతో కశ్మీర్ రగిలిపోతోంది. కశ్మీర్‌పై చర్చలకు మేం సిద్ధం. కానీ భారత్ చర్చలకు ఆమోదం కాని షరతులు విధిస్తోంది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని - నవాజ్ షరీఫ్ (21-9-16)
 
ప్రసంగం 5 నిమిషాలు
మానవహక్కుల ఉల్లంఘనలో అత్యంత హేయమైనది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం దే శ విధానం అయినప్పుడు అదీ యుద్ధ నేరం కిందికే వస్తుంది. పాక్ అలాంటి యుద్ధనేరాలకు పాల్పడుతోంది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత దౌత్య అధికారి - ఈనమ్ గంభీర్ (22-9-2016)

పట్టు వదలని పాకిస్తాన్ ఎప్పటిలా శవాన్ని భుజాన వేసుకుని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లేచి నిలబడింది.
 ‘‘జమ్మూకశ్మీర్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది’’ అని పెద్దగా అరిచి చెప్పింది! ‘‘అందుకు సాక్ష్యం.. ఇదిగో... నా భుజం మీద ఉన్న ఈ శవమే’’ అని శవాన్ని కూడా చూపించింది!
 సభలో పిన్ డ్రాప్ సెలైన్స్. అంత పెద్ద సెంట్రల్ హాల్లో పాక్ ఒంటిచేత్తో గుండెలు బాదుకోవడం ఒక్కటే వినబడుతోంది, కనబడుతోంది. (ఒంటిచేయి ఎందుకంటే.. ఇంకో చేత్తో శవాన్ని జారిపోకుండా పట్టుకోవాలిగా).
 
పాక్ చెబుతున్నది ఏమిటో అర్థం కానట్లు చూశాయి కొన్ని దేశాలు. అర్థం అయ్యీ కానట్లు చూశాయి మరికొన్ని దేశాలు. అర్థం చేసుకునే ఉద్దేశం లేనట్లు చూశాయి ఇంకొన్ని దేశాలు.
 ‘‘అదెలా? నీ భుజం మీద ఉన్నది అమరవీరుడైన ఓ భారతీయ సైనికుడు కదా?’’ అని మాత్రం అన్నిదేశాలూ అనుకున్నాయి. అనుకున్నాయి కానీ పైకి అనలేదు.
 ‘‘పాక్... ఓ మై ఫ్రెండ్’’ అంటూ చైనా, పాక్ భుజం మీది భారతీయ సిపాయి సహా పాకిస్తాన్‌ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ‘‘నీ వెంట ఎప్పుడూ నేనుంటా నా ప్రియ నేస్తం’’ అని మాట ఇచ్చింది.
 
ఎప్పటిలాగే భారత్ ఒంటరి అయింది! ఎప్పటిలాగే భారత్ వాదన ఒంటరి కాబోతోంది. ఎప్పటిలాగే భారత్... శవంలోని బేతాళుడిలా...‘‘రాజా... పొరుగున ఉన్న ఒక దేశం..’’ అంటూ మెల్లిగా ఏదో చెప్పబోయింది.  
 అప్పుడొచ్చింది సీన్‌లోకి ఓ అమ్మాయి. ఎంగ్ అండ్ ఎనర్జిటిక్ గర్ల్! తొడుక్కుని ఉన్న కోటును తీసి పక్కన పెట్టినట్టుగా దౌత్య భాషను, సహజసిద్ధమైన భారతీయ మృదుభాషణను తీసి పక్కన పడేసింది.  
 ‘‘మిస్టర్ ప్రెసిడెంట్..!’’... ఆమె కంఠం ఖంగ్ మంది.
 ‘‘మిస్టర్ ప్రెసిడెంట్..!’’... సర్వసభ్య సమావేశం  ప్రతిధ్వనించింది. ఆవలింతలు ఆగిపోయాయి. ఆలింగనాలు వెనక్కు జంకాయి. 131 దేశాలు ముందుకు వంగాయి. వంగి, తమ ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై ఆ అమ్మాయిని చూశాయి!
   
మిస్టర్ ప్రెసిడెంట్... భారత భూభాగమైన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన దీర్ఘమైన ఆరోపణకు స్పందనగా సమాధానం ఇచ్చే హక్కును నేనీ వేదికపై వినియోగించుకుంటున్నాను. మానవహక్కుల ఉల్లంఘనలో అత్యంత హేయమైనది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం దే శ విధానం అయినప్పుడు అదీ యుద్ధ నేరం కిందికే వస్తుంది. ఎంతోకాలంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నా దేశం, మా పొరుగుదేశాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. మా భౌగోళిక ప్రదేశాలను కూడా దాటి ఆ ఉగ్రవాదం విస్తరించింది.
 
మిస్టర్ ప్రెసిడెంట్... గడిచిన వారమే, ఇక్కడికి ఎంతోదూరంలో లేని న్యూయార్క్‌లో పదిహేనేళ్ల క్రితం జరిగిన ఉగ్రవాద దాడులలో ప్రాణాలు కోల్పోయిన వేలాదిమంది అమాయకులకు యావత్ప్రపంచం నివాళులు అర్పించింది. ఆ భయంకరమైన దాడులకు కారకులైన వారి అడుగుజాడలు పాకిస్థాన్‌లోని అబట్టాబాద్‌కు దారితీయడాన్ని ప్రపంచం నేటికీ మర్చిపోలేదు.
 
ప్రఖ్యాతి చెందిన ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయం పరిఢవిల్లిన ఆ నేల ఇప్పుడు ఉగ్రవాద బోధనాచార్యులకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ‘విద్యార్థులను’ ఆకర్షిస్తోంది. ఆ విష పాఠ్యాంశాల దుష్ర్పభావం భూగోళం అంతా విస్తరిస్తోంది. విశ్వవ్యాప్త ఉగ్రవాదానికి కేంద్రంగా తనను తాను వ్యవస్థీకరించుకున్న పాకిస్తాన్ మానవ హక్కుల గురించి ప్రవచించడం అనే విపరీతాన్ని ఇప్పుడు మనం చూడవలసి వస్తోంది.
 మిస్టర్ ప్రెసిడెంట్... ఇవాళ ఈ మహోన్నతమైన సభలో పాకిస్తాన్ తన కపట నీతులను వల్లెవేయడానికి కాస్త ముందు, న్యూఢిల్లీలోని ఆ దేశపు దౌత్యాధికారి.. 18 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకున్న ఉడీ ఉగ్ర ఘాతుకంపై వివరణ ఇచ్చుకునేందుకు పిలుపు అందుకున్నారు.

మా పొరుగు దేశంలో శిక్షణపొంది, సాయుధులై మా దేశంలో దాడులకు పాల్పడేందుకు నిరంతరం ఒక ప్రవాహంలా వచ్చి పడుతున్న ఉగ్రవాదుల ఘాతుకాలలో భాగమే ఈ ఉడీ దాడి కూడా.
 మిస్టర్ ప్రెసిడెంట్...  పాకిస్తాన్... ప్రజాస్వామ్యం కొరవడిన దేశం. తన సొంత ప్రజలపైన కూడా ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్న దేశం అది. మైనారిటీలను, మహిళలను అణచివేస్తోంది. క్రూరమైన చట్టాలతో కనీస మానవ హక్కులను హరించివేస్తోంది. అందుకే భారత్ ఒక ప్రజాస్వామ్య దేశంగా జమ్మూకశ్మీర్‌లోని తన పౌరులందరికీ అన్ని రకాల ఉగ్రవాదాల నుంచి భద్రత కల్పించేందుకు ప్రతినబూనింది. ఉగ్రవాదాన్ని నా దేశం అనుమతించదు. వ్యాప్తి చెందనీయదు.  
 
మొదటిసారి పాక్ ఓడిపోయింది!
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మొదటి సారి పాక్ ఓడిపోయింది. మొదటిసారి భారత్ గెలిచింది. మొదటిసారి భారత్ నేరుగా పాకిస్తాన్ పేరు ఎత్తింది. మొదటిసారి భారత్ ప్రత్యక్షంగా పాక్ ను టైస్ట్ కంట్రీ అంది. ఒకటే చప్పట్ల హోరు. సమావేశంలో కాదు. 120 కోట్ల భారతీయ హృదయాలలో! దేశమంతటా శతకోటి అభినందనలు. అమితాశ్చర్యానందాలు..  ఈ చిన్నమ్మాయ్ ఎవరో భలే మాట్లాడిందని! పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గుర్రున చూశారు. అది మన దేశం కంట పడింది. ప్రపంచం కంటా పడింది.
 
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని ఉడీలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో భారత్ సైనికుల వీరమరణం తర్వాత దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్.. ఐక్యరాజ్య సమితితో పాక్‌ను నిలబెట్టి కడిగేసిన ఆ అమ్మాయి ప్రసంగం.
 ఆమె పేరు ఈనమ్ గంభీర్! ఐక్యరాజ్య సమితితో భారత్ తరఫున ‘ఫస్ట్ సెక్రటరీ’ హోదాలో ఉన్న యువ దౌత్యాధికారి!
 
సోషల్ మీడియాలో  కోలాహలం
యు.ఎన్.లో నవాజ్ షరీఫ్ అబద్ధాలను బ్లాస్ట్ చేసిన ఈనమ్ గంభీర్ ప్రొఫైల్ చాలా చిన్నది! బయోగ్రఫీ అంతకన్నా చిన్నది. మనిషి సింపుల్. ముఖంపై ఎప్పుడూ సన్నటి నవ్వు. తెలివైన కళ్లు. పోలికలో మన ఇండియన్ ఫారిన్ ఆఫీసర్ దేవయాని కోబ్రగేడ్‌లా ఉంటుంది. మాట స్థిరంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. అంతర్జాతీయ వేదికపై ఒక భారతీయ దౌత్య అధికారి ప్రసంగానికి ముగ్ధురాలైన ఇండియా.. ఒక యుద్ధాన్ని గెలిచినట్లో, యుద్ధంలాంటి వరల్డ్ క్రికెట్ కప్ చాంపియన్ అయినట్లో వేడుక చేసుకోవడం వంటి సందర్భం మునుపెన్నడూ లేదు!
 
కార్యక్షేత్రంలో కదనశీలి
ఈనమ్ ఆర్ట్‌నీ, ప్రాచీన సంస్కృతులను ప్రేమిస్తారు. సమాజాన్ని మార్చాలని తపిస్తారు. జెనీవా విశ్వవిద్యాలయంలో కూడా చదువుకుని వచ్చిన ఈ అమ్మాయి ఫారిన్ సర్వీస్‌ను ఎంచుకోవడంతో తన అభీష్టానికి అనుగుణమైన కార్యక్షేత్రంలోకే వచ్చిపడ్డారు. ‘క్షేత్రం’ అని అనడం దేనికంటే... తన ఉద్యోగ నిర్వహణ జరుగుతున్నది యుద్ధక్షేత్రం వంటి వాతావరణంలో. అక్కడ పాకిస్తాన్ వంటి సమాజాలను మార్చే పనిలో నిర్విరామంగా కృషి చేస్తూండే భారతీయ దౌత్య ఉద్యోగులలో ఈనమ్ ముందు వరుసలో ఉంటారు. ఇంగ్లిష్, హిందీ, స్పానిష్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఈనమ్ శాంతి సామరస్యాలను యుద్ధ పరిభాషలో వ్యక్తీకరించడాన్ని బాగానే అభ్యసించారని యు.ఎన్.లో పాక్‌కి ఆమె ఇచ్చిన ఈ ‘రిబటల్’ చెబుతోంది.
 
రాసింది ఎవరైనా... రాజేసింది ఈ అమ్మాయే!
స్క్రిప్టు బాగుంటే సరిపోదు. డెలివరీ అదిరిపోవాలి. ఈనమ్ అదరగొట్టారు! యు.ఎన్.లో భారత బృందానికి లీడర్ సయ్యద్ అక్బరుద్దీన్. ఆయన, ఆయనతోపాటు యు.ఎన్.లో మన జాయింట్ సెక్రెటరీ రుద్రేంద్ర టాండన్, మిగతా కార్యదర్శులు సుజాతా మెహ్‌తా, ఎస్.జైశంకర్ కలసి ప్రసంగాన్ని దట్టించారు. ఆ మందుగుండును తన గొంతులోంచి శతఘ్నిలా మండించారు ఈనమ్. పాక్ యు.ఎన్.లో కుప్పకూలి పోయింది. ఈనమ్ ఫేస్‌బుక్‌లో గానీ, ట్వీటర్ అకౌంట్‌లో గానీ ఆమె గురించి పెద్దగా వివరాలు ఉండవు.

విదేశీ వ్యవహారాల శాఖ గుంభనంగా ఉండే విధంగానే ఈ విదేశీ వ్యవహారాల యువ దౌత్యాధికారి కూడా తన గురించిన వివరాలను ఎక్కువగా తెలియనివ్వరు. ట్వీటర్ అకౌంట్‌లో ఆమె పరిచయం ్చ ఐఛీజ్చీ ఈజీఞౌఝ్చ్ట, ్చ ఈ్ఛజిజీజ్ట్ఛీ అన్నంత వరకే ఉంటుంది! పాక్ గురించి ఆమెకు పరిపూర్ణంగా తెలుసు. భారత్  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ‘పాకిస్థాన్ డెస్క్’లో కొంతకాలం పని చేశారు. పదోన్నతిపై ఇప్పుడు న్యూయార్క్‌లో ఉన్నారు. అక్కడ ఆమె పని.. ప్రపంచ దేశాల మధ్య భారత్‌ను నిరంతరం యాక్టివ్ మోడ్‌లో ఉంచడం.

2015లో ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లడానికి ముందు అర్జెంటీనాలో భారత దౌత్యాధికారిగా విధులను నిర్వర్తించారు. ఈ అమ్మాయి స్పార్క్ చూసి అక్బరుద్దీనే ఢిల్లీ నుంచి యు.ఎన్.కు రప్పించుకున్నారు. ఒక విధంగా ఆయన ఆమెకు గురువు. ఆ గురువే ఇప్పుడు తన శిష్యురాలిని పాక్ మీదికి విజయవంతంగా ప్రయోగించారు.
 
ఈనమ్‌నే ఎందుకు ఎంపిక చేశారు?
యు.ఎన్.లో పాకిస్తాన్‌పై ఎదురు దాడికి భారత్ ఈనమ్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంది? గర్ల్ పవర్! యూత్ పవర్! ఉద్ధండులైన సీనియర్లు ఉన్నారు. దిగ్గజాలైన మాటకారులు ఉన్నారు. ఆ సీనియారిటీ, ఆ మాటకారితనం ఎప్పుడూ ఉండేవే. యు.ఎన్.లో పాక్ దాడి చేయడం. భారత్ ప్రతిఘటించడం ఏళ్లుగా చూస్తున్నదే. యు.ఎన్. పెద్దల దృష్టిని తన వైపు మళ్లించుకోలేని రొటీన్ ఇది.

ఈ రొటీన్‌ను తప్పించి, యు.ఎన్‌లో చురుకు తెప్పించేందుకు అందర్లోకీ వయసులో చిన్నదైన, చురుకైన ఈనమ్‌ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు యు.ఎన్.లో మన దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్, ఆయన బృందం. భారత్‌లో మహిళల స్థితిగతులపై కూడా పాక్ తరచు ఇంట, బయట మాట్లాడుతుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ‘అయితే.. చలో... యు.ఎన్.లో మన అమ్మాయి చేత మాట్లాడిద్దాం’ అని అనుకున్నారు అక్బరుద్దీన్. మాటకు మాటలా, తూటాకు తూటాలా.. (పాక్; మహిళల ప్రస్తావన తెస్తోంది కాబట్టి) మనవాళ్లూ మహిళనే ఎంపిక చేశారు. పాక్ గురించి బాగా తెలిసిన యువతి కనుక ఆ దేశంపై తిరుగుదాడికి ఈనమ్‌ని పంపించారు.
 
మరికొన్ని విశేషాలు
ఈనమ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేట్. హిందూ కాలేజ్ (ఢిల్లీ యూనివర్సిటీ) నుంచి పట్టభద్రులయ్యారు  2005లో ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరారు. ఆమెతో పాటు ఆ సర్వీసులో చేరినవారు ఆమెను షార్ప్ అండ్ హార్డ్‌వర్కింగ్ అంటారు  ఈనమ్ మొదటి ఉద్యోగం మాడ్రిడ్‌లో. అక్కడే ఆమె స్పానిష్ భాష నేర్చుకున్నారు  తర్వాత అర్జెంటీనాకు బదలీ అయ్యారు. అక్కడి నుంచి ఇండియా వచ్చి, ‘పాక్ డెస్క్’లో చేరారు  నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రత, ఐరాస భద్రతామండలి సంస్కరణలు, ఉగ్రవాద నియంత్రణ.. ఉద్యోగంలో ఈనమ్ అధ్యయనాంశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement