ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు షరీఫ్‌పై కోర్టు ధిక్కరణ కేసు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పాక్ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇంగ్లిష్‌లో మాట్లాడి కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్నారు. ఉర్దూను అధికార భాషగా పాటించాలన్న పాక్ రాజ్యాంగంలోని 251వ ఆర్టికల్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెలువడిన మరుక్షణం నుంచీ నాయకులు, అధికారులు తమ ప్రసంగాలు, అధికారిక లావాదేవీల్లో ఇంగ్లిష్‌కు బదులుగా ఉర్దూను ఉపయోగించాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలను షరీఫ్ ధిక్కరించారని జాహిద్ ఘనీ అనే వ్యక్తి పాక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ‘ది డాన్’ పత్రిక వెల్లడించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన వారిలో భారత్‌తో సహా పలు దేశాల నాయకులు వారి జాతీయ భాషల్లోనే ప్రసంగించారని.. షరీఫ్ మాత్రం ఇంగ్లిష్‌లో ప్రసంగించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఘని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాక్ ప్రధానిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2012లో అప్పటి పాక్ ప్రధాని యూసుఫ్జ్రా గిలానీపైనా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.