కశ్మీర్‌పై మళ్లీ నోరుపారేసుకున్న షరీఫ్!
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం
న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అనుచిత వ్యాఖ్యలతో భారత్‌ను రెచ్చగొట్టారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంపై భారత్ తేల్చి ఉంటే.. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ మరింత ముందుకెళ్లి ఉండేదన్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా కీర్తిస్తూ.. కశ్మీర్ స్వాతంత్య్రం కోరుతున్న యువతను భారత ఆర్మీ చంపేస్తోందన్నారు. దీనిపై స్వంతంత్ర విచారణ జరగాలని, లోయలో కర్ఫ్యూ ఎత్తేయాలన్నారు. కశ్మీర్‌లో భారత ఆర్మీ ఆకృత్యాల ఆధారాలను ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు అందజేస్తానన్నారు.
భారత్ ముందస్తుగా నిబంధనలు పెట్టి చర్చలకు పిలుస్తోందని, అన్యాయం జరుగుతున్నప్పుడు శాంతి నెలకొనటం అసాధ్యమని అన్నారు. కశ్మీర్‌పై ముందుగా చర్చిస్తానంటే భారత్‌తో శాంతి చర్చలకు ఎప్పటికీ సిద్ధమన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా పలు దేశాల నేతలతో భేటీ సందర్భంగా షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాల నేతలతో సమావేశం సదర్భంగా కశ్మీర్ అంశాన్ని షరీఫ్ లేవనెత్తారు.