భారత్పై పాక్ దౌత్యయుద్ధం!
కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాలకు 22 మంది పాక్ ఎంపీలు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే లక్ష్యంలో భాగంగా పాక్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్.. 22 మంది పార్లమెంటు సభ్యులను ప్రపంచ దేశాలకు ప్రత్యేక దూతలుగా పంపించాలని నిర్ణయించారు. ‘‘కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారంపై ఐక్యరాజ్యసమితి ఎప్పటి నుంచో అమలు చేయాల్సిన హామీని ఆ సంస్థకు మేం గుర్తుచేస్తాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ అంశం గురించి ప్రముఖంగా వివరించేందుకు పార్లమెంటు సభ్యులను పంపాలని నేను నిర్ణయించాను’’ అని ఆయన పేర్కొన్నట్లు రేడియో పాకిస్తాన్ శనివారం వెల్లడించింది. జూలై 8వ తేదీన హిజ్బుల్ కమాండ్ బుర్హాన్ వాని భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో చనిపోవటంతో కశ్మీర్ లోయలో కల్లోలం చెలరేగటం.. దానిపై భారత్, పాక్‌ల మధ్య వాగ్యుద్ధం ముదురుతుండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకునే ఆలోచనతో పాక్ తాజాగా తన ఎంపీలను ఆయా దేశాలకు ప్రత్యేక దూతలుగా పంపించాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా కశ్మీర్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారం చేసేలా ఈ ప్రత్యేక దూతలు చూడాలని.. తద్వారా తాను సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేటపుడు అంతర్జాతీయ సమూజపు ఉమ్మడి అంతఃచేతనను కదిలించగలిగేందుకు ప్రాతిపదిక తయారుచేయాలని నవాజ్ సూచించారు. కొన్ని దశాబ్దాల కిందట కశ్మీర్ వివాదంపై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది భారతదేశమేనని, కానీ ఇప్పుడు అదే దేశం ఆ హామీని అమలు చేయటం లేదన్న విషయాన్ని భారత్‌కు గుర్తుచేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.