అమ్మ, అక్కతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా..
ముంబై: సెల్ఫీ మరో కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల బ్యాచ్‌లర్ ఇంజినీర్ విద్యార్థిని బంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో తల్లి, సోదరితో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా.. మృత్యువాత పడింది. కన్నతల్లికి, కుటుంబానికి తీరని శోకం మిగిలింది. సముద్ర తీరంలో బాంద్రా ఫోర్ట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు గంటల అనంతరం సముద్రంలో కొట్టుకుపోతున్న ఆమె మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు, ఫైర్ బ్రిగేడ్ అధికారులు గుర్తించారు.
ఫైనలియర్ పరీక్షలు రాసిన మీనాక్షి ప్రియ రాజేశ్ గత నెల 30న తల్లిదండ్రులు, అక్కతో కలిసి ముంబైను సందర్శించేందుకు వచ్చింది. అంధేరిలోని ఓ హోటల్‌లో వారి కుటుంబం బస చేసింది. బుధవారం రోజంతా ముంబైని చూసేందుకు ఓ క్యాబ్‌ను కుటుంబం బుక్ చేసింది. బంద్రా ఫోర్ట్ వద్ద ఆమె కుటుంబం పలు ప్రదేశాలను వీక్షించిందని, వెనుక సముద్రం కనిపించేలా ఓ పెద్ద గుట్ట మీద నుంచి తల్లి, అక్కతో కలిసి సెల్ఫీ తీసుకుంటానని మీనాక్షి తెలిపిందని, ఇలా సెల్ఫీ తీసుకుంటుండానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని ముంబై పోలీసులు హెచ్చరిక బోర్డు గతంలోనే పెట్టారు.