శశిథరూర్
ఢిల్లీ(ఐఏఎన్ఎస్): తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్ ఈరోజు సాయంత్రం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సిఆర్పిసి 164 సెక్షన్ ప్రకారం వసంత విహార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ శశిథరూర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాపషెరా ప్రాంతంలోని అలోక్ శర్మ కార్యాలయానికి ఈ సాయంత్రం శశిథరూర్ వెళ్లి దాదాపు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. టివి జర్నలిస్ట్ నళినీ సింగ్ వాగ్మూలాన్ని కూడా మేజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. సునంద పుష్కర్ సెల్ ఫోన్ రికార్డుల ప్రకారం ఆమె చివరిసారిగా నళినీ సింగ్కు కాల్ చేశారు.
అనంతరం నళినీ సింగ్ ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ సునంద చనిపోవడానికి ముందు తనతో ఏం మట్లాడారో మేజిస్ట్రేట్కు చెప్పానని తెలిపారు. ఆయన నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పినట్లు తెలిపారు.
సునంద పుష్కర్ ఈ నెల 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు కూడా తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు.
ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని శశిథరూర్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు.