సన్ టీవీ చానళ్ల భవిష్యత్ ఏంటి?
భద్రత అనుమతి నిరాకరణతో సందేహాలు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌లోని 33 చానళ్లకు కేంద్ర హోం శాఖ భద్రతాపరమైన అనుమతి నిరాకరించడంతో వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీటికి ఢోకా లేదని సన్ టీవీ చెబుతోంది. అనుమతి నిరాకరణకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి లేఖా రాలేదని గ్రూప్ సీఎఫ్‌ఓ సీఎల్ నారాయణన్ చెప్పారు.
అనుమతుల నిరాకరణకు ఎలాంటి ప్రాతిపదికా లేదని, తమ లెసైన్సులను రద్దు చేస్తే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తమ నెట్‌వర్క్‌లోని చాలా చానళ్లకు 2021 వరకు అనుమతులు ఉన్నాయన్నారు. సన్ టీవీపై, దాని ప్రమోటర్ అయిన కళానిధి మారన్, ఆయన సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌లపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో హోం శాఖ ఈ చానళ్లకు భద్రతాపర అనుమతి నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి. వీరు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు, అక్రమ టెలిఫోన్ లైన్ల ఏర్పాటు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
కాగా, సన్ టీవీ యాజమాన్యాన్ని వేరే వారికి అప్పగించడమో, లేకపోతే డెరైక్టర్లను మార్చడమో చేస్తే ఆ చానళ్లకు అనుమతుల నిరాకరణపై పునస్సమీక్షిస్తామని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. టీవీ చానళ్ల అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్‌లకు పదేళ్ల వ్యవధితో హోం శాఖ అనుమతిస్తుంటుంది. ప్రధానంగా దక్షిణ భారతంలో విస్తరించిన సన్ టీవీ నెట్‌వర్క్‌లో జెమినీ టీవీ, జెమినీ మూవీస్ తదితర తెలుగు చానళ్లు ఉన్నాయి. మొత్తం 9. 5 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు.