హత్యా..? ఆత్మహత్యా..?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అన్న కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) అలోక్ శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల అవి విషపూరితమై సునంద మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవ పరీక్షలో తేలిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె రెండు చేతులపై 12కు పైగా గాయాలున్నాయని, ఎడమ చెంపపై కమిలిన గాయం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు.
అయితే ఈ గాయాల వల్ల చనిపోయే అవకాశం లేదని వివరించారు. చేతులపై గాయాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్‌డీఎం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా హత్యకు గురైందా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. ‘‘ఆమె మరణానికి మూడు కారణాలు ఉండొచ్చు. ఒకటి హత్య.. రెండు ఆత్మహత్య.. మూడోది ప్రమాదవశాత్తూ చనిపోవడం. ఇందులో మరణానికి కచ్చితంగా ఏది కారణమైందో దర్యాప్తు చేయాలి’’ అని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు.