పారికర్‌కు సవాల్.. సుప్రీంలో పిటిషన్
పారికర్‌కు సవాల్.. సుప్రీంలో పిటిషన్
Published Mon, Mar 13 2017 8:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న పారికర్‌కు ఊహించని చట్టపరమైన అవాంతరాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
40 స్థానాలు ఉన్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపింది. దీంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రే గోవా సీఎంగా పారికర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. అయితే, ఈ హడావిడి రాజకీయ పరిణామాలతో బిత్తరపోయిన కాంగ్రెస్.. మంగళవారం సీఎంగా ప్రమాణం చేయబోతున్న పారికర్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెద్దగా సమయం లేకపోవడంతో కాంగ్రెస్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది.
Advertisement