మరణశిక్షను యావజ్జీవానికి మార్చిన సుప్రీంకోర్టు
కేంద్రం పిటిషన్ తిరస్కరణ
క్షమాభిక్ష పిటిషన్లపై ఇకనైనా వేగంగా స్పందించాలన్న ధర్మాసనం
న్యూఢిల్లీ/చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలకు ఊరట లభించింది. ఆ కేసులో ఖైదీలు సంతన్, మురుగన్, పెరారివాలన్‌లకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్ 11 ఏళ్ల పాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఖైదీల క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యానికి కారణమంటూ ఏమీ లేదని, అయినా ఖైదీలు జైల్లో ఏవిధమైన మానసిన వేదన అనుభవించకుండా సంతోషంగానే ఉన్నారని కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే సింగ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ వాదనతో తాము అంగీకరించమన్న ధర్మాసనం.. ప్రభుత్వ జాప్యం వల్లే శిక్ష తగ్గిస్తున్నామని చెప్పింది.
ఇకపై క్షమాభిక్ష కోరుతూ దాఖలైన పిటషన్లపై రాష్ట్రపతికి తగిన సమయంలో సూచనలు చేస్తే జాప్యం జరగకుండా ఉంటుందని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. ఈ కేసులో చేసినట్లు కాకుండా ఇకపై క్షమాభిక్ష పిటిషన్లపై కేంద్రం వేగంగా స్పంది స్తుందని తాము నమ్ముతున్నామని చెప్పింది. క్షమాభిక్షపై నిర్ణయంలో తీవ్ర జాప్యం జరిగిన కారణంగా తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ ఆ ముగ్గురు ఖైదీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 4న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టిన విషయం తెలిసిందే.
ఖైదీలను విడుదల చేయాలి
సుప్రీంకోర్టు తీర్పును తమిళనాడులోని డీఎంకే, డీఎండీకే, ఎండీఎంకేతో సహా వివిధ రాజకీయ పక్షాలు స్వాగతించాయి. 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ ముగ్గురు ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. ఖైదీలను విడుదల చేస్తే తనకు మరింత సంతోషమని కరుణానిధి అన్నారు. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఎండీఎంకే చీఫ్ వైకో డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వినగానే ఖైదీల ముఖంలో సంతోషం వెల్లివిరిసిందని వెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు. పెరారివాలన్ తల్లి అర్పుతమ్ అమ్మాళ్ చీఫ్ జస్టిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన కుమారుడి విడుదల కోసం ఎదురు చూస్తానని తెలిపారు.
రాజీవ్ హంతకులకు ఊరట
Published Wed, Feb 19 2014 3:51 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement