ఎవరి బలమెంతో ఎల్లుండి తేల్చండి!
గురువారం గోవాలో బలపరీక్షకు ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోవా అసెంబ్లీలో గురువారం బలపరీక్ష నిర్వహించి.. ఎవరి బలమెంతో తేల్చాలని ఆదేశించింది. ఈలోపు గవర్నర్ నిర్ణయించిన ప్రకారం మంగళవారం (ఈరోజు) సాయంత్రం ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం చేయడానికి అంగీకరించింది. దీంతో ఈ రోజు సీఎంగా ప్రమాణం చేయబోతున్న పారికర్ ఎల్లుండి లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపి.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టింది.
అయితే, రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసింది. మెజారిటీ ఫిగర్‌ను సాధించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగిందని, రాజ్యాంగ ప్రమాణాలను దిగజార్చిందని కాంగ్రెస్ తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే దీటుగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మంగళవారమే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. ఎవరికీ మెజారిటీ ఉందో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
(చదవండి: సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు షాక్!)