'ముజఫర్నగర్'పై సీబీఐ విచారణకు సుప్రీం నో
న్యూఢిల్లీ : ముజఫర్నగర్ ఘటనపై సీబీఐ, సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముజఫర్ నగర్ అల్లర్లను నిరోధించటంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయ్యిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకూ బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా గత ఏడాది ముజఫర్నగర్ జిల్లాలో మహా పంచాయితీ పేరుతో రెండు వర్గాల వారు సమావేశం కాబోతుండగా కొందరు రాళ్ళ దాడి జరపడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. క్రమంగా విస్తరించడంతో ముజఫర్ నగర్‌లో 60 మందికి పైగా చనిపోయారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే.