![Supreme Court Allahabad High Court to Monitor CBI Probe Into Hathras Case - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/27/sc.jpg.webp?itok=BJyOrUr4)
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు.
అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు. (చదవండి: హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య)
ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం కోరిన వివరాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు
Comments
Please login to add a commentAdd a comment