షిండే క్షేమం.. మూడు రోజుల్లో డిశ్చార్జి
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, మరికొంత కోలుకున్న తర్వాత ఆయనను మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని షిండే కుమార్తె ప్రీతి షిండే తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్మే అయిన ప్రీతి.. తన తండ్రి ఆరోగ్యం గురించి విలేకరులకు వివరించారు.
72 సంవత్సరాల వయసున్న సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో ఈనెల నాలుగో తేదీన ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స జరిగింది. ఊపిరితిత్తుల్లో చిన్న కణితి లాంటిది పెరగడంతో ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. శస్త్రచికిత్స చిన్నదే కాబట్టి, మంత్రి త్వరలోనే కోలుకుంటారని, కొన్ని రోజుల్లోనే మళ్లీ తన రోజువారీ కార్యకలాపాలకు హాజరవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.