తెలంగాణపై సుష్మా స్వరాజ్ సందేహం
తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న సంతోషంతో పాటు మరోవైపు అనుమానం కూడా ఉందని బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో శనివారం సాయంత్రం జరిగిన తెలంగాణ ప్రజాగర్జన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగులో ప్రసంగాన్ని ఆరంభించిన సుష్మా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ ప్రాంత ప్రజలు పలుసార్లు మోసపోయారని, మరోసారి మోసం జరుగుతుందేమోననే సందేహం కలుగుతోందని ఆమె అన్నారు.
తెలంగాణ విషయంలో యూపీఏ మరోసారి మోసం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సుష్మా పిలుపునిచ్చారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే తాను ఉద్యమంలో స్వయంగా పాల్గొంటానని సుష్మా హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి వెళ్లగొడతామని ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సుష్మా స్వరాజ్కు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.