రెండు సీట్లున్న జిల్లాల్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. గతంతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య పెరగడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా మార్పులతో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 14కు చేరింది. హైదరాబాద్ పరిధిలోని రెండు సీట్ల నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ఇంకా ముగియలేదు.
దీంతో మిగతా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఓటింగ్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
ఒక్కో జిల్లాకు ఒక్క సీటు ఉన్నప్పుడు ఈ విధానంలో సందేహాలేమీ ఉత్పన్నం కాలేదు. కానీ, రెండు స్థానాలున్న జిల్లాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు... నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను రెండు సెగ్మెంట్లుగా విభజిస్తారా.. లేదా ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం కల్పిస్తారా... అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ఓటింగ్ విధానంపై ఈసీ అధికారులను కలసి సందేహాలు వెలిబుచ్చారు. రెండు స్థానాలున్న జిల్లాలోనూ ఎమ్మెల్సీల ఎన్నిక పాత పద్ధతిలోనే జరుగుతుందని ఈసీ వర్గాలు ధ్రువీకరించాయి.
అక్కడి ఓటర్లందరికీ ఇద్దరు అభ్యర్థులను ఎంచుకునే అవకాశముంటుంది. రెండు సీట్లున్నప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులందరి పేర్లతో ఒకే బ్యాలెట్ ఉంటుంది. ఆ జిల్లాలోని ఓటర్లు ప్రాధాన్యక్రమంలో తమ ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. వీరిలో అత్యధిక ప్రాధాన్యత ఓట్లు గెలుచుకున్న ఇద్దరు అభ్యర్థులు విజేతలుగా నిలుస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు సాధించిన అభ్యర్థిని తొలి విజేతగా, తర్వాత సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు పొందిన అభ్యర్థిని మరో విజేతగా ప్రకటిస్తారు.