సిండికేట్ బ్యాంక్ లాభంపై ఎన్‌పీఏల ఎఫెక్ట్..!
బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంక్ గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15) మార్చితో ముగిసిన చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శనివారం ప్రకటించింది. 2013- 14 మార్చి క్వార్టర్‌తో పోల్చితే బ్యాంక్ నికర లాభం 2 శాతం పెరిగింది. ఈ మొత్తం రూ.409 కోట్ల నుంచి రూ. 417 కోట్లకు పెరిగినట్లు ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ టీకే శ్రీవాస్తవ తెలిపారు. మొండి బకాయిల (ఎన్‌పీఏ)కు అధిక మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) జరపాల్సి రావడంతో 4వ త్రైమాసికంలో స్వల్ప స్థాయి లాభాలకే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.5,357 కోట్ల నుంచి రూ.6,599 కోట్లకు ఎగసింది.
స్థూల ఎన్‌పీఏల పరిమాణం రుణాల్లో 2.62 శాతం నుంచి 3.13 శాతానికి ఎగసింది. నికర ఎన్‌పీఏలు సైతం 1.56 శాతం నుంచి 1.90 శాతానికి చేరాయి.
మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే నికర లాభం 11 శాతం క్షీణించింది. ఈ పరిమాణం రూ.1,711 కోట్ల నుంచి రూ.1,523 కోట్లకు పడింది. ఆదాయం రూ.19,945 కోట్ల నుంచి రూ.23,725 కోట్లకు చేరింది.
తుది డివిడెండ్‌ను 47%గా బ్యాంక్ బోర్డ్ ప్రతిపాదన.