జీఎస్టీని సీఎం వ్యతిరేకిస్తే మద్దతిస్తాం
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభ్యంతరాలు నిజమైతే, అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లేందుకు వామపక్షాలు సిద్ధమని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రతిపక్షాలను సీఎం తక్షణమే సమావేశపరచి జీఎస్టీపై చర్చించాలన్నారు.
జీఎస్టీకి వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. శుక్రవారం ఎంబీ భవన్‌లో తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ పరిధి నుంచి వ్యవసాయం, టెక్స్ టైల్, బీడీ, గ్రానైట్ పరిశ్రమలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకున్న ఆర్థిక అధికారాలను జీఎస్టీ నిర్వీర్యం చేస్తోందని, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను జీఎస్టీ ద్వారా కేంద్రం హరిస్తోందని ఆరోపించారు.