సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీపీఎం ప్రకటించింది. రాష్ట్రస్థాయి మొదలు గ్రామస్థాయి వరకు తమ కార్యకర్తలను ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగస్వాముల ను చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ఉన్న తమ విజ్ఞాన కేంద్రాలు, పార్టీ ఆఫీసులను ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అవసరాలకు పూర్తిగా ఉపయోగించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బాగ్ లింగంపల్లి, గచ్చిబౌలిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పార్టీ కార్యాలయాలు, సిటీ ఆఫీసు కార్యాలయం, జిల్లాల్లోని పార్టీ, ప్రజాసంఘాల ఆఫీసులను ప్రభుత్వం అవసరం మేరకు ఉపయోగించుకోవాలని కోరారు. బాగ్ లింగంపల్లిలోని విజ్ఞాన కేంద్రంలోని మెడికల్ క్లినిక్, హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా ల్లో జనరిక్ మెడికల్ షాపులున్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఈ వైరస్ నివారణకు గ్రామస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు సీపీఎం మద్దతిస్తున్నదని తమ్మినేని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment