
సాక్షి, యాదాద్రి: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ను, ఆయన అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభ అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం ఊపు తగ్గిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించేంత వరకే జోష్ కనిపిస్తుందని, ఆ తర్వాత వారి ప్రచారం ఊపు కూడా తగ్గిపోతుందన్నారు.
బీఎల్‌ఎఫ్ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఉండదని, సీపీఐ మాతో కలిసి రాకపోవడం దురదృష్టకరమన్నారు. మహాకూటమి భ్రమలో సీపీఐ, జేఏసీ ఎందుకు ఉన్నారో వారికే తెలియడం లేదన్నారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించిపెట్టే లక్ష్యంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బీసీలకు 65 సీట్లను ప్రకటించిన ఏకైక కూటమి బీఎల్‌ఎఫ్, సీపీఎం కూటమినేనని పేర్కొన్నారు.