వర్షాకాలంలో.. చక్కటి ఆహారం | tasty food in rainy season | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో.. చక్కటి ఆహారం

Published Sat, Jun 27 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

వర్షాకాలంలో.. చక్కటి ఆహారం

వర్షాకాలంలో.. చక్కటి ఆహారం

సాక్షి: వేసవి వెళ్లింది. తొలకరి పలకరింపుతో వర్షాకాలం వచ్చేసింది. వస్తూవస్తూ అనేక వ్యాధులను వెంటబెట్టుకొచ్చే ఈ కాలంలో  క్లిష్టమైన వాతావరణ పరిస్థితులుంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి  తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లతో వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని శక్తిమంతంగా, హైడ్రేషన్‌లో ఉంచే పోషకాహారాన్ని ఎక్కుగా తీసుకుంటూ.. జీవక్రియను సక్రమంగా, చురుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచి, ఆరోగ్యంగా ఉంచే మాన్‌సూన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
 
మంచి నీరు
చలికాలంలో దాహం వేయలేదని మంచినీళ్లు తాగడం తగ్గిస్తారు కొంతమంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలా జరగకుండా శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సీజన్‌లో కూడా నీరు ఎక్కువగా తాగాలి. బాగా మరిగించి, వడపోసిన నీటిని తాగితే మరింత శ్రేయస్కరం.
 
తాజా ఫలాలు
వర్షాకాలంలో.. వ్యాధినిరోధకతను పెంపొందించే  విటమిన్-సి అధికంగా ఉండే ఫలాలను తినాలి. అలాంటి వాటిల్లో దానిమ్మ, కివి,ఆరెంజ్ వంటివి ఉత్తమం. జలుబు, దగ్గుతో వంటి రోగాలతో బాధపడుతున్నట్లయితే నీటిశాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్‌ను తినడం ఉత్తమం.
 
వెచ్చని పానీయాలు
వర్షాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. అందుకు గోరువెచ్చని సూపులు, పానీయాలు తరచూ తాగుతూ ఉండాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో సూపులు బాగా ఉపయోగపడుతాయి. అల్లం, లెమన్, గ్రీన్ టీలను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.
 
కూరగాయలు
వర్షాకాలంలో తాజా కూరగాయలను తినటం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఇతర క్రిములు వాటిపై ఉండే అవకాశం ఉంది. కూరగాయలను ఉడికించి తింటే ఆరోగ్యానికి మరింత మంచిది.
 
వండిన ఆహారాలు
ఈ సీజన్‌లో తీసుకునే ఆహారాలు బాగా ఉడికించినవై ఉండాలి.  పచ్చి కూరలు తినటం పూర్తిగా నివారించాలి. డైరీ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను ఉడికించి మాత్రమే తీసుకోవటం శ్రేయస్కరం.
 
మాంసం
ఈ కాలంలో బాగా ఉడికించిన మాంసాహారాలను మాత్రమే తీసుకోవాలి. కూరల్లో నూనె తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్ చేసిన లేదా ఉడికించిన  మాంసాహారాలు తీసుకోవటం ఉత్తమం.
 
ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు
వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆయిల్ లేదా ప్రైడ్ ఫుడ్స్‌ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవటం మంచిది. జీర్ణక్రియను మెరుగుపరచటంలో ఇవి దోహదపడుతాయి.
 
యాంటీఆక్సిడెంట్స్
యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, శరీరానికి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో కాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి వంటివి ఉత్తమమైనవి. అందువల్ల వీటిని తరచూ మీ డైట్‌లో ఉండేటట్లు చూసుకోవాలి.
 
జ్యూస్‌లు
వేసవి మాత్రమే కాకుండా అన్నికాలాల్లోనూ పళ్లరసాలు ఆరోగ్యానికి ప్రయోజనం.  శరీరానికి తగిన హైడ్రేషన్‌ను అందివ్వటానికి తాజా పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూస్‌లను అధికంగా తీసుకుంటే మంచిది.
 
తినకూడని పదార్థాలు..
వర్షాకాలంలో సాధారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల జీర్ణమయ్యేందుకు ఎక్కవ సమయం తీసుకునే ఆహారం తీసుకోవటాన్ని నివారించాలి. పకోడాలు, రోడ్డుపక్కన దొరికే చాట్స్, కచోరిలు, సమోసాలు, ైఫాస్ట్‌ఫుడ్స్, ఆకుకూరలు, సీఫుడ్స్ తినడం తగ్గించాలి. ప్రధానంగా ఆకుకూరలు వండేటప్పుడు సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement