ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరుఅందించండి
ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
మంత్రులు నారాయణ, సత్యకుమార్‌తో కలిసి సమీక్ష
కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధుల వివరాలపైనా ఆరా
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయన్నారు. తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పారు.
పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలæ కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిసార ప్రబలిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభ సమావేశ మందిరంలో అత్యవసరంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నీరు కలుషితమైన చోట నీటి సరఫరా ఆపేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ ఆదేశించారు.
కార్యాచరణ సిద్ధం చేయాలిపైపులైన్ల తనిఖీ ఎప్పటికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, మరమ్మతులు అవసరమైతే తక్షణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
కాగా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అతిసార వ్యాధి నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment