కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు..రేసుకు టాటా
ముంబై: కొత్త బ్యాంకుల ఏర్పాటు రేసు నుంచి టాటా గ్రూప్ వైదొలగింది. బ్యాంక్ లెసైన్స్ కోసం చేసిన దరఖాస్తును వాపసు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించినట్లు తెలిపింది. ప్రస్తుతం గ్రూప్ అనుసరిస్తున్న ఆర్థిక సేవల విధానం ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ తమ వ్యాపారాలకు అవసరమైన మద్దతును అందిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాటా సన్స్ పేర్కొంది.
రేసులో బిర్లా, అంబానీ...
కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల రేసు నుంచి టాటా సన్స్ తప్పుకున్నప్పటికీ ఇంకా 24 సంస్థలు పోటీలో నిలిచాయి. వీటిలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితరాలున్నాయి. కాగా, రెండు నెలల క్రితమే వేణుగోపాల్ ధూత్‌కు చెందిన వీడియోకాన్ కూడా రంగం నుంచి తప్పుకోవడం గమనార్హం. గ్రూప్‌నకు చెందిన దేశ, విదేశీ వ్యాపార అవసరాలకు తగిన స్థాయిలో తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం సహకరిస్తున్నందున బ్యాంకింగ్ దరఖాస్తునుఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ వివరించిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీంతోపాటు వాటాదారుల అభిప్రాయంమేరకు వెనక్కు తగ్గుతున్నట్లు పేర్కొన్నదని వెల్లడించింది. వెరసి ఇందుకు తాము అనుమతించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
తగిన సమయంలో మళ్లీ
ప్రస్తుతానికి బ్యాంకింగ్ ఏర్పాటు అంశం నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తూనే ఉంటామని టాటా గ్రూప్ పేర్కొంది. తగిన సమయంలో మళ్లీ బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆహ్వానంమేరకు జూలైలో మొత్తం 26 కంపెనీలు కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేశాయి. జనవరికల్లా బ్యాంకింగ్ లెసైన్స్‌ల ఎంపికను రిజర్వ్ బ్యాంక్ చేపడుతుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇటీవలే తెలిపారు. గత 20ఏళ్లలో 12 బ్యాంకుల ఏర్పాటుకు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ లెసైన్స్‌లు జారీ చేసింది. వీటిలో 10 బ్యాంకులను 1993 మార్గదర్శకాల ప్రకారం అనుమతించగా, 2001లో సవరించిన నిబంధనల ప్రకారం మరో రెండు బ్యాంకులు(కోటక్ మహీంద్రా, యస్ బ్యాంక్) ఏర్పాటయ్యాయి.