టీసీఎస్ సంచలన ప్రకటనతో ఐటీ ఢమాల్
ఐటీ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంచలన వ్యాఖ్యలు ఐటీ రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. క్యూ 2 లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో ప్రతికూలతలు నమోదవుతున్నట్టు ముంబై కి చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో కనిపించనున్నట్లు హెచ్చరించింది. దీంతో మదుపర్లు భారీ అమ్మకాలతో గురువారం నాటి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ ఐటీ రంగ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 6.4 శాతం పతనమై ఆరునెలల కనిష్టానికి చేరింది. మరో ఐటీ మేజర్ విప్రో షేర్ కూడా ఇదే కోవలోకి చేరింది. భారీ అమ్మకాల ఒత్తిడితో 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
ఆగష్టు 2016 డేటా ఆధారంగా వరున నష్టాలు ఊపందుకుంటున్నాయనీ, ఆర్థిక సేవలు, బీమా (బిఎఫ్ఎస్ఐ) సేవల పరిణామల కారణంగా ప్రధానంగా కంపెనీ కస్టమర్ల వృద్ధిలో ఒక హెచ్చరిక గుర్తించబడిందని బీఎస్ కి అందించిన ఒక ప్రకటనలో తెలిపింది . అమెరికా ప్రాజెక్టులపై ఈ ప్రభావం కనిపిస్తోదని టీసీఎస్ పేర్కొంది. ఈ ప్రకటన స్టాక్ ప్రతికూల ప్రభావం చూపించిందనీ, తదుపరి 2-3 త్రైమాసికాల్లో టీసీఎస్ అండర్ ఫెర్ ఫార్మర్ గా ఉండనుందనీ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరాష్కర్ వ్యాఖ్యానించారు. ఇది ఊహించిన పరిణామమేని, మొత్తానికి ఐటీ రంగానికి ప్రతికూలమేనన్నారు.
మరోవైపు బ్రెగ్జిట్ ఉదంతం నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, ఆలస్యంకావడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, మెండ్ ట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు క్యూ 1 ఆర్థిక ఫలితాలు కూడా ఐటీ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఒరాకిల్ ఫైనాన్షియల్ నేలచూపులు చూస్తున్నాయి.