Shares Slump
-
భారీగా పతనమైన యస్ బ్యాంక్ షేరు
సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంక్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్ క్యాప్ అని గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. క్యూ1 ఫలితాలు బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్ బ్యాంక్ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. -
ఆర్బీఐ, సీబీఐ షాక్: ఐసీఐసీఐ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐకు వరుస షాక్‌లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కేసు నమోదు, సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఐసీఐసీఐ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు 6శాతం (5.6) పతనాన్ని నమోదు చేసింది. దీనికితోడు సెక్యూరిటీ విక్రయాల అంశంలో నియమాలను పాటించని కారణంగా ఆర్బీఐ విధించిన 58.9 కోట్ల రూపాయల జరిమానా కూడా ఐసీఐసీఐసీ బ్యాంకు నెత్తిన పిడుగులా పడింది. మరోవైపు దివాళా బాటలో వీడియోకాన్ షేరు సైతం 5 శాతంనష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం. కాగా వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన అంశంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టింది. వీడియోకాన్ గ్రూప్‌నకు వేలకోట్ల రుణాలిచ్చినందుకు గాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు విడుదల చేయడంలో క్విడ్‌ప్రో కో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
డామినోస్ పిజ్జా ఆపరేటర్‌కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ సంచలన ప్రకటనతో ఐటీ ఢమాల్
ఐటీ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంచలన వ్యాఖ్యలు ఐటీ రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. క్యూ 2 లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో ప్రతికూలతలు నమోదవుతున్నట్టు ముంబై కి చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో కనిపించనున్నట్లు హెచ్చరించింది. దీంతో మదుపర్లు భారీ అమ్మకాలతో గురువారం నాటి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ ఐటీ రంగ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 6.4 శాతం పతనమై ఆరునెలల కనిష్టానికి చేరింది. మరో ఐటీ మేజర్ విప్రో షేర్ కూడా ఇదే కోవలోకి చేరింది. భారీ అమ్మకాల ఒత్తిడితో 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఆగష్టు 2016 డేటా ఆధారంగా వరున నష్టాలు ఊపందుకుంటున్నాయనీ, ఆర్థిక సేవలు, బీమా (బిఎఫ్ఎస్ఐ) సేవల పరిణామల కారణంగా ప్రధానంగా కంపెనీ కస్టమర్ల వృద్ధిలో ఒక హెచ్చరిక గుర్తించబడిందని బీఎస్ కి అందించిన ఒక ప్రకటనలో తెలిపింది . అమెరికా ప్రాజెక్టులపై ఈ ప్రభావం కనిపిస్తోదని టీసీఎస్ పేర్కొంది. ఈ ప్రకటన స్టాక్ ప్రతికూల ప్రభావం చూపించిందనీ, తదుపరి 2-3 త్రైమాసికాల్లో టీసీఎస్ అండర్ ఫెర్ ఫార్మర్ గా ఉండనుందనీ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరాష్కర్ వ్యాఖ్యానించారు. ఇది ఊహించిన పరిణామమేని, మొత్తానికి ఐటీ రంగానికి ప్రతికూలమేనన్నారు. మరోవైపు బ్రెగ్జిట్ ఉదంతం నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, ఆలస్యంకావడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, మెండ్ ట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు క్యూ 1 ఆర్థిక ఫలితాలు కూడా ఐటీ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఒరాకిల్ ఫైనాన్షియల్ నేలచూపులు చూస్తున్నాయి. -
మిస్ అయిన జస్ట్ డయల్
ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు 3శాతం నష్టాల్లో ఉంది ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో, ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు. -
భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం
♦ నికర లాభం 76% తగ్గి రూ.153 కోట్లకు ♦ టర్నోవరు 14 శాతం పడి రూ.3,222 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ రంగ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికం(2016-17, క్యూ1) కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 76 శాతం తగ్గి రూ.647.4 కోట్ల నుంచి రూ.153.5 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు 14.11 శాతం పడి రూ.3,752 కోట్ల నుంచి రూ.3,222 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 60 శాతం తగ్గి రూ.400 కోట్లు నమోదు చేసింది. యూఎస్, వెనిజులా మార్కెట్లలో అమ్మకాలు మందగించడమే లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. యూఎస్ఎఫ్డీఏ నుంచి వార్నింగ్ లెటర్ రావడంతో ఉత్పత్తుల విడుదల ఆలస్యం కావడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. పోటీ పెరగడంతో ప్రధాన మాలిక్యూల్స్ విలువ పడిపోవడం కూడా సమస్యను పెంచిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తితో కలసి ఈ సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పెరిగిన భారత వ్యాపారం..: ఉత్తర అమెరికా జనరిక్స్ వ్యాపారం 16.2 శాతం తగ్గి రూ.1,552 కోట్లు నమోదు చేసింది. ఇక యూరప్ జనరిక్స్ వ్యాపారం 16 శాతం పడి రూ.161.5 కోట్లుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు 26 శాతం తగ్గి రూ.427.7 కోట్లను తాకాయి. వీటికి భిన్నంగా భారత్‌లో కంపెనీ వ్యాపారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ 10 శాతం వృద్ధి చెంది రూ.522 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఆదాయం 16 శాతం పడి రూ.469 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు 9 శాతం అధికమై రూ.480 కోట్లుంది. 5 శాతం పడిన షేర్లు.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రెడ్డీస్ షేరు మంగళవారం సుమారు 5 శాతం పడింది. బీఎస్ఈలో షేరు 4.37% పడి రూ.3,322.85 వద్ద స్థిరపడింది. ఇంట్రా డేలో 5.15 శాతం తగ్గి రూ.3,295 నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 4.67 శాతం పడి రూ.3,319.65 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 1.54 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 15 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
భారీగా కుదేలైన రెడ్డీస్ ల్యాబ్స్
-
బ్రిటానియాకు పతంజలి దెబ్బ
ముంబై : అతిపెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ స్వల్ప లాభాలాను నమోదు చేసినప్పటికీ, మార్కెట్లో ఈ కంపెనీ షేరు కుదేలయ్యింది. ముఖ్యంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న పోటీ తమ వ్యాపారం పై ప్రభావం చూపిందని కంపెనీ చెబుతోంది. అటు విశ్లేషకుల అంచనాలకుగుణంగా సంస్థ లాభాలు పెరగడకపోవడంతో మార్కెట్లో బ్రిటానియా 8 శాతం మేర నష్టపోయింది. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు తక్కువగా ఆదాయాన్ని నమోదుచేయడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. బెంగళూరుకు చెందిన బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభాలు 14శాతం పెరిగి రూ.190 కోట్లగా చూపించాయి. 8శాతం మేరే అమ్మకాలు పెరిగి రూ.2,190 కోట్లగా నమోదయ్యాయి. 46శాతం పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు, 14శాతం కంపెనీకి వచ్చే ఇతరత్రా ఆదాయాలు పడిపోయాయి. దీంతో బ్రిటానియా నికర లాభాలు కొంతమేర చేజారి, మార్కెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందులు కావడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్సైజ్ డ్యూటీ ప్రోత్సహకాలను దశల వారీగా ప్రభుత్వం తొలగించడంతో, ఈ త్రైమాసికంలో రాబడులపై 100 పాయింట్ల ప్రభావం చూపాయని బ్రిటానియా తెలిపింది. అదేవిధంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పోటీ, కంపెనీ మార్కెట్ షేరుపై ప్రభావం చూపిందని క్రిస్ట్ వెల్త్ మేనేజ్ మెంట్ సీఈవో లాన్సేలట్ డి కన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం బ్రిటానియా లాభాలపై ప్రభావం చూపాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటానియా లాభాలు మార్కెట్ అంచనాలను తాకలేకపోవడంతో, మార్కెట్లో ఈ షేర్లు 8శాతం మేర నష్టపోయాయి.