
మా లాభాలకు టీడీపీతో సంబంధం లేదు
- ‘సాక్షి’ వార్తపై హెరిటేజ్ వివరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడే హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరుగుతున్నాయంటూ ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనం వాస్తవాలకు దూరంగా ఉందని ‘హెరిటేజ్ ఫుడ్స్’ పేర్కొంది. కొన్నాళ్లపాటు లాభాలు పెరగటం, కొన్నాళ్ల పాటు లాభాలు తగ్గటం అనేది తాము రిటైల్ బిజినెస్‌ను ఆరంభించటం వల్ల, డెయిరీ వ్యాపారంలో మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటం వల్ల సంభవించిందని హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు.
23 ఏళ్లుగా హెరిటేజ్‌ను ఉత్తమ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు తమతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఉద్యోగులు ఎంతో శ్రమించారని, రైతులకు అన్నివిధాలా సాయపడటంతో పాటు వారి వద్ద మిగిలిపోయిన పాలను మార్కెట్ చేయడానికి కూడా సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘‘ప్రభుత్వం నుంచి మేం భూములు, కాంట్రాక్టులు, ఖనిజాలు వంటి ఎలాంటి అనుచిత ప్రయోజనాలూ పొందకుండానే మా బ్రాండ్‌ను తీర్చిదిద్దాం. ఇక సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్, ఇతరత్రా పథకాలు హెరిటేజ్‌కు మాత్రమే వర్తించినవి కావు. పాలసీలో భాగంగా అన్ని కంపెనీలకూ ఇచ్చినట్లే హెరిటేజ్‌కూ ఇచ్చారు’’ అని ఆ ప్రకటనలో వివరించారు.
ఇలాంటి వార్తల వల్ల కంపెనీతో ముడిపడిన అన్ని వర్గాల ప్రయోజనాలూ దెబ్బతింటాయని సంస్థ పేర్కొంది. హెరిటేజ్‌కు టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదని, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారం ఉందని అక్కడి వృద్ధిని కూడా టీడీపీతో లింకు పెట్టడం సరికాదని సంస్థ పేర్కొంది.