‘కారెక్కిన’ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న | tdp mla sayanna mlc prabhakar join trs | Sakshi
Sakshi News home page

‘కారెక్కిన’ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న

Published Fri, Dec 4 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

గురువారం మీడియాతో మాట్లాడుతున్న సాయన్న,ప్రభాకర్. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి

గురువారం మీడియాతో మాట్లాడుతున్న సాయన్న,ప్రభాకర్. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: టీడీపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్‌లు ‘గులాబీ’ గూటికి చేరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గురువారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారిక నివాసంలో తనను కలసిన సాయన్న, ప్రభాకర్‌లకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను మంత్రి హరీశ్‌రావు వెంట బెట్టుకుని రాగా, ఎమ్మెల్యే సాయన్నను టీడీపీ నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు వెంటతీసుకుని వచ్చారు.

ఈ సందర్భంగా సాయన్న, ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను చూసే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని, ముఖ్యంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చేస్తున్న కృషి అభి నందనీయమని సాయన్న పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం వంటివి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బం దులు కలగలేదని, అన్నివిధాలా తనకు ఆదరణ లభించింద న్నారు. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితులు ఎదురవడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని... అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల ఒత్తిడి మేరకే తాను పార్టీ వీడాల్సి వచ్చిందని సాయన్న పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరినందున టీడీపీకి, టీటీడీ బోర్డు సభ్యుని పదవికి రాజీ నామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
 
కాంగ్రెస్‌లో అన్యాయం: ఎమ్మెల్సీ ప్రభాకర్
కాంగ్రెస్‌లో కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ను వీడి, టీఆర్‌ఎస్‌లో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర, గ్రేటర్ అభివృద్ధి కూడా ఆయనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement