
బట్టలూడదీసుకుని తిరగమంటారా?
విజయవాడ : టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై విజయవాడలో శనివారం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సహనం కోల్పోయారు. ప్రత్యేక హోదాపై ఇంతకంటే ఏం చేయాలి? బట్టలూడదీసుకుని తిరగమంటారా? అంటూ రాయపాటి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ తప్పు పని చేస్తోందని...మొదట యూపీఏ ప్రభుత్వం ప్రాథమికంగా తప్పు చేసిందని, ప్రస్తుతం బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో మొండిగా ఉందని రాయపాటి అన్నారు.
ఈ విషయంలో టీడీపీ, బీజేపీ పార్టీలకు ...రెండింటికీ నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఎప్పుడున్నారని, ఆయనది విజిటింగ్ వీసా అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ముందుండి నడిపిస్తే..తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు.
కాగా ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని గడిచిన 14 నెలలుగా ప్రత్యేక హోదా కోసం ఆశతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలపై కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని శుక్రవారం లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది.