కమల్‌నాథ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) పార్లమెంటు ఉభయసభలలో ఏ సభలో ముందు ప్రవేశపెడతారన్న ఉత్కంఠకు తెరపడింది. రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రకటించారు.
బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర పడిన తరువాత ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు రాజ్యసభ బీఏసీ సభ్యుడు సత్యవ్రత చతుర్వేది మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని నిన్న రాజ్యసభ చైర్మన్ కార్యాలయ వర్గాలు కూడా ధృవీకరించాయి. బిల్లు ప్రవేశపెట్టే విషయంమై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమలనాథ్ చర్చలు కూడా జరిపారు.
ఈ బిల్లులో ఆర్థికపరమైన అంశాలు ఉన్నందున ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని, లోక్సభలోనే ప్రవేశపెట్టాలని నిపుణులు అభిప్రాయం. దాంతో బిల్లును ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టే ఆలోచనను విరమించుకున్నారు. ఈ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. విభజన బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అన్న విషయమై సమావేశంలో చర్చించి తేలుస్తారు.