న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును గురువారమే లోక్సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. బిల్లు విషయంలో పట్టుదలకు యూపీఏ సర్కార్ ప్రభుత్వం .... ఎట్టకేలకు సభలో ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ, కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ షెడ్యూల్ లో తెలంగాణ బిల్లు లేదని ఆయన తెలిపారు.
అంతకు ముందు కమల్ నాథ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ఎప్పుడైనా సభకు రావల్సిందేనన్నారు. అయితే ఇవాళ వస్తుందా... మూడ్రోజుల తర్వాత వస్తుందో చెప్పలేమన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కమల్ నాథ్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కాగా రేపు పార్లమెంట్‌కు సెలవు. సోమవారం సభ తిరిగి సమావేశమవుతుంది. సోమవారం నాడు సాధారణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అంటే ఆ రోజు తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టడం కుదరదు.