న్యూఢిల్లీ : ఎట్టకేలకు యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం మధ్యాహ్నం సభ్యుల నిరసనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టిన మరుక్షణమే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు.
అంతకు ముందు బిల్లు పెట్టగానే సీమాంధ్ర ఎంపీలు సభలో బల్లలు ఎక్కి మైకులు, దస్త్రాలు పడేశారు. నర్సరావు పేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోక్సభ జనరల్ సెక్రటరీ బల్లపై వస్తువులను చిందర వందర చేశారు. దాంతో ఆయనను తెలంగాణ టీడీపీ ఎంపీలు రమేష్ రాథోడ్, నామా నాగేశ్వరరావు అడ్డుకున్నారు.
సభలో జరిగిన విషయాలు ఇలా ఉన్నాయి..
- లోక్సభలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు చెందిన 18 మంది ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
- విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంకా మార్షల్స్ ఆధీనంలోనే ఉన్నారు.
- మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణకు గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.
- హడావుడిగా తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని తాము ముందునుంచి చెబుతున్నా కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోలేదని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ చెప్పారు.
- ఇంత గందరగోళం మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం సరికాదని ప్రధానికి తాము చెప్పినట్లు లోక్సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ తెలిపారు.
- గురువారం లోక్సభలో జరిగిన సంఘటనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకమని పార్లమెంటరీ వ్యవహారాల శాక మంత్రి కమల్నాథ్ చెప్పారు.