న్యూఢిల్లీ : విభజన బిల్లును ఆమోదించుకునే దిశగా కేంద్రం దూకుడుగా ముందుకు వెళుతోంది. ఓపక్క విభజనను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా తెలంగాణ బిల్లును ఎలాగైనా పార్లమెంట్లో ఆమోదింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపీల గందరగోళం మధ్యే బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మరో నాలుగు రోజులే ఉండటంతో అంతకు ఒకరోజు ముందే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన ప్రక్రియను ముగించడాటానికి వ్యూహం సిద్ధం చేసింది.
ఇక ప్రభుత్వం ఒత్తిడి తెస్తుండటంతో బిల్లు ఆమోద ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని లోక్‌సభ సచివాలయ అధికారులను స్పీకర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తం 109 క్లాజులపై ఓటింగ్ నిర్వహించాలన్నది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. యస్- నో స్లిప్పుల ద్వారా ఫలితాన్ని రాబట్టవచ్చు. బిల్లుపై సోనియా గాంధీ మాట్లాడాలని పార్టీ వర్గాలు కోరాయి. అయితే ఈ గందరగోళం మధ్య మాట్లాడటంపై ఆమె ఎటు నిర్ణయించుకోలేకపోతున్నారని సమాచారం. మొత్తానికి మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సభ్యుల నిరసనలతో లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. గందరగోళం మధ్యే సభ నడుస్తోంది.