సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే బిల్లుకే మద్దతివ్వాలి
Published Sun, Sep 8 2013 2:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, హైదరాబాద్: విభజన ప్రక్రియపై సీమాంధ్రలో వివిధ వర్గాల్లో తలెత్తుతున్న అభద్రతాభావం, ఉద్యోగ వర్గాలలో ఆందోళన, విద్య, వైద్య, నదీ జలాలు తదితర విషయాల్లో సందేహాలను నివృత్తి చేస్తూ, ఆ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉన్న తెలంగాణ బిల్లుకు మాత్రమే పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ నాయకులకు విజ్ఞప్తి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఈ అంశాలన్నింటినీ సవివరంగా వివరించాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీ సీమాంధ్ర ప్రాంత రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జులతోపాటు జై ఆంధ్ర ఉద్యమ కమిటీ నేతలు శనివారం హైదరాబాద్‌లో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వి.సతీష్‌జీ, పార్టీ నేతలు కంభంపాటి హరిబాబు, కె.శాంతారెడ్డి, సోము వీర్రాజు, బండారు దత్తాత్రేయ, ఎస్.సురేష్‌రెడ్డి, రంగారాజు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనకు పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల నుంచి తమకు ఎదురవుతున్న సమస్యలపై వారి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీగా తెలంగాణ అంశంపై తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కిపోయే అవకాశం లేకపోయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గమనించి విభజన ప్రక్రియలో పార్టీ ముందుకు పోవడం మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగాలని, దానిపై తగు సూచనలతో కూడిన డాక్యుమెంట్‌ను సమర్పించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఉద్రిక్తతలను పెంచే దిశగా ప్రకటనలు చేసే వారి విషయంలో కేంద్రం కఠిన చర్యలు చేపట్టే దిశగా బీజేపీ అగ్రనాయత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement