శ్రీవారికి కంఠాభరణం, సాలగ్రామ హారాన్ని సమర్పించిన కేసీఆర్ దంపతులు
- పద్మావతి అమ్మ వారికి ముక్కు పుడక కానుక
- కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులతో కలసి దర్శనం
- టీటీడీ అతిథి మర్యాదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి
- ఇరు తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్ష
- తీవ్ర అస్వస్థతకు గురైన పోచారం
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు బుధవారం తిరుమలలో ‘తెలంగాణ’ మొక్కులు చెల్లించారు. కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులతో కలసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. రూ.5 కోట్ల విలువైన స్వర్ణ సాలగ్రామ హారం, ఐదు పేటల స్వర్ణ కంఠాభరణాలను సమర్పించారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు ముక్కు పుడకను కానుకగా సమర్పించారు.
క్షేత్ర సంప్రదాయం ప్రకారం దర్శనం
తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం సీఎం కేసీఆర్ దంపతులు తొలుత భూవరాహ స్వామినిదర్శించుకున్నారు. అనంతరం మహా ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులందరూ వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వచ్చారు. తొలుత రంగ నాయకుల మండపంలో స్వర్ణ సాలగ్రామ హారం, స్వర్ణ కంఠాభరణానికి పూజలు చేశారు. అనంతరం వాటిని వెండి పళ్లాల్లో గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. పచ్చ కర్పూరపు హారతి వెలుగులో మూల విరాట్టు దివ్య మంగళ రూపాన్ని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వర్ణాభరణాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారి వెంట ఎంపీ కవిత దంపతులు, కేటీఆర్ కుటుంబ సభ్యులతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, సలహాదారులు కేవీ రమణాచారి, రాజీవ్‌శర్మ, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు.
తిరుచానూరులో బంగారు ముక్కు పుడక సమర్పణ
తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు.. తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, బంగారు ముక్కుపుడకను సమర్పించారు.
టీటీడీ ఆతిథ్యంపై సంతృప్తి
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు టీటీడీ ఘనంగా అతిథి మర్యాదలు చేసింది. స్వాగతం, బస, శ్రీÐవారి దర్శనం, భోజనం తదితర విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపింది. దీనిపై సీఎం కేసీఆర్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.
వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు
బుధవారం తిరుమలలో జరిగిన తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నవ్యల వివాహానికి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కొత్త దంపతులకు బంగారు ఉంగరాలు కానుకగా బహూకరించారు. నూతన దంపతులు సీఎం సమక్షంలోనే ఆ ఉంగరాలు మార్చుకున్నారు.
ఇరు రాష్ట్రాల సమస్యలన్నీ తొలగిపోతాయి
– తెలంగాణ, ఏపీల మధ్య సంబంధాలు గొప్పగా ఉంటాయి: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు చల్లగా ఉండేలా దీవించాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా ఎదగాలని వేడుకున్నానని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య సంబంధాలు గొప్పగా ఉంటాయని, అన్ని సమస్యలు తొలగిపోతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీటీడీ ధర్మ ప్రచార కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో ఎక్కడైనా శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ పూనుకుంటే ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు.
ఆనందంగా ఉంది: స్పీకర్
కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడిని విశ్వంలోని సమస్త జీవులన్నీ దర్శించి తరిస్తాయని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
త్వరలోనే శ్రీవారికి అలంకరిస్తాం: టీటీడీ ఈవో సాంబశివరావు
‘‘తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు శ్రీవారికి రూ.5 కోట్ల విలువైన 19.072 కిలోల బరువుగల స్వర్ణాభరణాలు సమర్పించారు. అందులో 14.148 కిలోల బంగారు సాలగ్రామ హారం, 4.924 కిలోల ఐదు పేటల స్వర్ణ కంఠాభరణం ఉన్నాయి. శ్రీవారికి ఇప్పటికే కొన్ని సెట్ల ఆభరాణాలు ఉన్నాయి. తాజాగా సమర్పించిన వాటిని కూడా త్వరలోనే గర్భాలయంలోని మూల విరాట్టుకు అలంకరిస్తాం..’’
పోచారం శ్రీనివాసరెడ్డికి అస్వస్థత
మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం తిరుమలలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం సీఎం కేసీఆర్ కలసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన 10 గంటల సమయంలో తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారులు ఆయనను వెంటనే స్థానిక అశ్విని ఆస్పత్రిలోని అపోలో అత్యవసర చికిత్స కేంద్రానికి తరలించి, చికిత్స అందించారు. దాదాపు గంట తర్వాత ఆయన సాధారణ స్థితికి వచ్చారు. నిద్రలేమి, ఉపవాసం కారణంగా పోచారం అస్వస్థతకు లోనయ్యారని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగా.. తిరుపతికి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లతోపాటు ముందు జాగ్రత్తగా ఒక వైద్యుడిని కూడా తీసుకెళ్లారు.
ప్రభుత్వం తరపున ఇదే తొలిసారి: రమణాచారి
తిరుచానూరు: శ్రీవారికి ఎందరో రాజులు విలువైన బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారని, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎందరో ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారని... ప్రభుత్వం తరఫున కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించడం ఇదే తొలిసారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం తిరుచానూరులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి ప్రభుత్వం తరఫున బంగారు ఆభరణాలు సమర్పిస్తామని కేసీఆర్ మొక్కుకున్నట్లు చెప్పారు.
కేసీఆర్ దంపతులకు పట్టువస్త్రాలు అందజేసిన చెవిరెడ్డి
– తమ ఇంటికి రావాలని చెవిరెడ్డి దంపతులకు కేసీఆర్ ఆహ్వానం
తిరుచానూరు (చంద్రగిరి): తిరుచానూరులో అమ్మవారి దర్శనం చేసుకున్న సీఎం కేసీఆర్ దంపతులను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆశీర్వాద మండపంలో కేసీఆర్ దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసానికి భోజనానికి రావాల్సిందిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబ సభ్యులతో పరిచయం ఉంది. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలతో కలసి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు కూడా.