శ్రీవారికి కేసీఆర్ కానుకలు సిద్ధం
శ్రీవారికి కేసీఆర్ కానుకలు సిద్ధం
Published Tue, Apr 5 2016 8:01 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి స్వర్ణాభరణాలు చేయిస్తానని మొక్కుకున్న కేసీఆర్.. త్వరలోనే ఆ మొక్కుతీర్చుకోనున్నారు. స్వామివారికి అందజేయనున్న కానుకలలో సాలిగ్రామహారం, బంగారు కంఠె ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో పదిహేను రోజుల్లో మిగతావి కూడా పూర్తయితే కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారైనట్లే. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాళిదాస్ జ్యుయెలర్స్ వీటి తయారీ టెండర్లను దక్కించుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛతతో గ్రాము రూ.2,611కు ఒప్పందం కుదుర్చుకుంది. 14.900 కిలోలతో సాలి గ్రామహారం ఖరీదు రూ.3.70 కోట్లు కాగా.. ఐదు పేటల కంఠె తయారీకి 4.650 కిలోల బంగారం ఖరీదు రూ.1.21కోట్లు ఖర్చయింది.
ఇవిగాక మరో మూడు ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటి మొత్తానికి రూ.4.97 కోట్లతో ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. మిగతా ఆభరణాలు మరో పదిహేను రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. ఒప్పందం మేరకు తయారీ సంస్థే తరుగు, నాణ్యత, రవాణా ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఆభరణాలను పూర్తిగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తయారుచేయించారు.ఈ నెలాఖరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల చేరుకుని శ్రీవారికి ఆభరణాలు సమర్పించి మొక్కు చెల్లించుకోనున్నారు.
Advertisement
Advertisement