
పార్లమెంటు వీధిలో ర్యాలీ.. జగన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో ఆకస్మికంగా తలపెట్టిన పార్లమెంటుకు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని ముందుండి నడిపించిన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన సమైక్య ధర్నాలో చివరగా మాట్లాడిన జగన్.. ప్రసంగం చివర్లో కేంద్రం తీరును ఎండగడుతూ పార్లమెంటుకు ర్యాలీకి పోదాం అని ప్రకటించారు. వెంటనే స్టేజీ దిగి పార్లమెంటు వైపుగా నడక ప్రారంభించారు. ధర్నాలో పాల్గొన్న సుమారు ఐదు వేల మంది సమైక్యవాదులు ఒక్కసారిగా ‘జై జగన్’, ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు చేతపట్టుకొని ఉత్సాహంగా ముందుకు కదిలారు.
జగన్ ముందుకు సాగుతుండగా సమైక్యవాదులు పార్లమెంటు వైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇటలీ సోనియా డౌన్‌డౌన్’, ‘వీ వాంట్ జస్టిస్’ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లిన అనంతరం వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా వేసి ర్యాలీని ముందుకు పోనిచ్చేది లేదని తెగేసి చెప్పటంతో జగన్ అక్కడే బైఠాయించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, బాలినేని, ఆదినారాయణరెడ్డి తదితరులు సైతం బైఠాయించారు. ఆందోళనను విరమించాలని, అక్కడినుంచి లేవాలని పోలీసులు కోరినా జగన్ తిరస్కరించారు.
ఈ సమయంలో కొందరు బారికేడ్లను దాటేప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. అరగంట అనంతరం జగన్ సహా అక్కడ బైఠాయించిన నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ లోనికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ నేతలు, సమైక్యవాదులు ఆగ్రహానికిలోనయ్యారు. బారికేడ్లను దాటి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, తమ్మినేని సీతారాం, చల్లా మధుసూధన్‌రెడ్డిలు కల్పించుకొని సమైక్యవాదులకు నచ్చజెప్పారు. దీంతో వారంతా జగన్ అరెస్ట్‌కు నిరసనగా అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. సుమారు గంట అనంతరం వేరే దారిలో వైఎస్ జగన్ సహా అరెస్ట్ చేసిన నేతలందరినీ విడుదల చేసి పంపించడంతో అక్కడివారంతా శాంతించారు.