
డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్
ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు
హైదరాబాద్ : నగరంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. డ్రగ్స్ కేసులో 11మందిని విచారించామని ఆయన తెలిపారు. డ్రగ్స్ బాధితుల్లో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తేలిందని, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడినట్లు సబర్వాల్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలో డ్రగ్స్ మూలాలను ఏరిపారేయాలని ఆదేశించింది. పూర్తిస్థాయి దర్యాప్తుకు తక్షణమే సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే డ్రగ్స్ పంపిణీదారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు స్కూల్, కాలేజీ విద్యార‍్థులు డ్రగ్స్ బారినపడటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో డ్రగ్స్ ఆనవాల్లు కనిపించకూడదని, కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా నిందితుల విచారణలో అనేక సంచలనాత్మక అంశాలు వెలుగుచూశాయి. అనేక మంది బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉండటం అధికారులను విస్తుబోయేలా చేసింది.