‘పాలమూరు’కు బ్రేక్
- సాగునీటి పనులపై ముందుకెళ్లబోమంటూ ఎన్‌జీటీకి సర్కారు హామీ
- తాగునీటికి సంబంధించిన పనులు మాత్రం కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్:
పాలమూరు ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న సాగునీటి పనులకు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టులో సాగునీటి కోసం చేపడుతున్న పనుల టెండర్ల విషయంలో ముందుకెళ్లబోమని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నమోదు చేసుకున్న ఎన్జీటీ ధర్మాసనం.. ఈ అంశంపై విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
అటవీ, పర్యావరణ చట్టాల నిబంధనల ప్రకారం ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన బి.హర్షవర్ధన్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ధర్మాసనం.. ఆ పథకంలోని సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టవద్దంటూ ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొందే వరకు సాగునీటి పనులు చేయడానికి వీల్లేదని.. తాగునీటికి సంబంధించిన పనులు మాత్రం కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే ఈ ఉత్తర్వుల పూర్తి కాపీ అందుబాటులోకి రాకపోవడంతో నాలుగు రోజులుగా సందిగ్ధత నెలకొంది. మంగళవారం అది అందుబాటులోకి రావడంతో టెండర్ల విషయంలో స్పష్టత వచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో సాగునీటి ప్రాజెక్టు పనుల కోసం పిలిచిన టెండర్ల విషయంలో ఇకపై ముందుకు వెళ్లబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు ఎన్జీటీకి హామీ ఇచ్చారు. దీనితో పాలమూరు ప్రాజెక్టు సాగునీటి పనులు నిలిచిపోయినట్లే. అటవీ, పర్యావరణ చట్టాల ప్రకారం అనుమతులు తీసుకునేవరకు ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉండదు.