ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. కరడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడడంపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి,నెట్‌వర్క్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. కరడుగట్టిన సమైక్యవాదిగా మాట్లాడడంపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్కరోజు కూడా పదవిలో కొనసాగే అర్హతలేదని.. వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో వారు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై సీఎం మాట్లాడిన తీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చప్రాసీకి వున్న పరిజ్ఞానం లేదనిపించిందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో ఎద్దేవా చేశారు. తెలంగాణపై విషం కక్కుతున్న నీవు మనిషిరూపంలో ఉన్న జంతువని ధ్వజమెత్తారు. క్యాంపు ఆఫీసు కేంద్రంగా సీమాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ రెండు నెలల్లో అక్రమ సంపాదనకే అధిక ప్రాధాన్యమిస్తూ ఎన్ని అధికారిక ఫైళ్లు క్లియరెన్స్ చేశావో తెలియంది కాదన్నారు. అక్రమంగా రూ.300కోట్ల విలువ చేసే భూమిలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తున్న బినామీ నీవు కాదా? అని నిలదీశారు.
చీమూనెత్తురు ఉన్న ఏ ఒక్క తెలంగాణ మంత్రి కూడా క్యాబినెట్‌లో కొనసాగరని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనమేనని, దానిని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని మంత్రి డి.శ్రీధర్‌బాబు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లో ఓడిపోయారని థర్డ్ అంపైర్ ప్రకటించిన తర్వాత కూడా క్రీజ్‌లో నిలబడితే ఎలాగుంటుందో ప్రస్తుతం సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన తీరుపై తాము కూడా ఆలోచించాల్సి వస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణపైఅధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని శాసనసభ సాక్షిగా చెప్పిన సీఎం.. నేడు మాటమార్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పారు.
ఇందిర, నెహ్రూల ఆలోచనా విధానాలపై మాట్లాడిన కిరణ్‌కు ఆ తర్వాత దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయో తెలియదా అని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న ప్రభుత్వంపై టీఆర్‌ఎస్, టీడీపీలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న వారిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆయన కుర్చీని పదిలంగా ఉంచామని, ఆ సమయంలో తెలంగాణ ప్రజల నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీ కోసం భరించామని వివరించారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పడుతున్న సమయంలో తాను సమైక్యవాదినంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టడమేనని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండలో వ్యాఖ్యానించారు. ప్రపంచంలో నైలూ నదిని ఎనిమిది దేశాలు పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. పాకిస్థాన్, ఇండియాతో పాటు నేపాల్, బంగ్లాదేశ్‌లు కూడా నదులను పంచుకుంటున్న చరిత్ర సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. కృష్ణానదిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోదావరి నదిని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు రాష్ట్రాలు పంచుకుంటున్నది అందరం చూస్తున్నదేనని వివరించారు. కిరణ్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం లేఖ రాశారు.
కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉన్నట్లయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కు సీఎం పదవిని నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ కరీంనగర్‌లో డిమాండ్ చేశారు. తెలంగాణపై కిరణ్‌కుమార్ రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నాడని ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్‌లో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై కిరణ్ ధిక్కార స్వరం వినిపిస్తూ ఒక ఫ్యాక్షనిస్టులా మాట్లాడుతున్నారని ఎంపీ మందా జగన్నాథం హైదరాబాద్‌లో ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు లేవన్నారు. సీఎం వైఖరితో ఇరు ప్రాంతాల్లో వైషమ్యాలు పెరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందబాష్కర్ నల్లగొండ జిల్లా చిట్యాలలో చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 6వ తేదీకల్లా తెలంగాణ నోట్ సిద్ఢమవుతుందని ఆయన తెలిపారు.