
సీమాంధ్ర, తెలంగాణ పోటీ పడాలి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణకు ఇచ్చిన మాటకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. సీమాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి పదేళ్ల పాటు రాయితీలు ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. సీమాంధ్ర నేతలతో వార్ రూమ్ భేటీ ముగిసిన తర్వాత దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు.
సీమాంధ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో సీమాంధ్ర, తెలంగాణ పోటీ పడాలన్నారు. పెట్టుబడులు, అభివృద్ధిలో రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలని ఆకాంక్షించారు.
లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర మంత్రులకు సూచించామన్నారు. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడతామన్నారు. కొత్త సీఎం ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కొత్త సీఎంపై త్వరలో ప్రకటన వస్తుందని దిగ్విజయ్ అన్నారు.